సాక్షి, వరంగల్: ప్రస్తుతం వరంగల్‌లో సెంట్రల్ జైలు స్థలాన్ని రీజినల్ కార్డియాక్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో వైద్యశాఖకు స్థలాన్ని కేటాయించాలన్న ఆదేశాలతో ఖైదీల తరలింపు చేపట్టామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ రాజీవ్‌త్రివేది తెలిపారు. సెంట్రల్‌జైలు నుంచి ఖైదీల తరలింపు మంగళవారం మొదలుకాగా, ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని వైద్యశాఖకు ఇస్తున్నందున కొత్తగా జైలు నిర్మించేందుకు ప్రభుత్వం మామునూరులో స్థలం కేటాయించిందని చెప్పారు. అక్కడ అత్యాధునిక హంగులతో కూడిన నూతన జైలు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు.
మొత్తం 956 మంది
ప్రస్తుతం సెంట్రల్ జైలులో 956 ఖైదీలు ఉండగా, వీరిని హైదరాబాద్‌లోని చర్లపల్లి, చంచల్‌గూడతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించనున్నట్లు డీజీ రాజీవ్‌త్రిదేవి వెల్లడించారు. తొలివిడతగా మంగళవారం 119 మందిని భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇందులో 80 మంది పురుషులు, 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. మిగతా వారి తరలింపు ప్రక్రియ ఇరవై రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైలులో విధులు నిర్వర్తిస్తున్న 267 మంది సిబ్బందికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామని చెప్పారు.
కాగా, జైలు ఆవరణలో ఉన్న పెట్రోల్ పంపులు యథావిధిగా నిర్వహిస్తామని, విచారణలో ఖైదీలను ఎక్కడకు తరలించాలనే విషయమై న్యాయమూర్తుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. కాగా, ఖైదీలను సామగ్రితో తరలించే క్రమంలో కొందరి బంధువులు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. వరంగల్ నుంచి తరలిస్తుండడంపై పలువురు ఖైదీల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైనా వచ్చి చూసేందుకు అనువుగా లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీలు ఎన్.మురళీబాబు, వై.రాజేష్, జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్‌రాయ్, డిప్యూ టీ సూపరింటెండెంట్లు డి.భరత్, అమరావతి, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: Telangana Formation Day: అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు
Comments
Please login to add a commentAdd a comment