సాక్షి, రంగారెడ్డి: వ్యవసాయ యంత్రాలు, పరికరాలు స్వతహాగా కొనుగోలు చేయలేని రైతుల కోసం మండలానికో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులోకి వస్తున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్ ధరలో దాదాపు 50 శాతానికి.. సన్న, చిన్న కారు రైతులకు మార్కెట్ ధరలో కొంచెం తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) నిధులతో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను సెర్ప్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి 31 సీహెచ్‌సీలు రాగా.. 29 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున గ్రాంట్ మంజూరయ్యాయి. హైదరాబాద్ మినహా జిల్లాకు ఒక మండలాన్ని చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.
మహిళలే నిర్వాహకులు..
వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సంఘాల్లోని సభ్యులే ఈ సీహెచ్‌సీల నిర్వాహకు లు. ఇలా ఒక మండలంలోని మహిళా రైతులంతా కలసి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూ ప్ (ఎఫ్‌పీజీ)గా ఏర్పడతారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన 31 మండలాల్లోని ఎఫ్‌పీజీలకు.. సీహెచ్‌సీ ఏర్పాటుకు కావాల్సిన కేంద్ర గ్రాంట్ అందింది. ఈ నిధులతో స్థానిక వ్యవసాయ పంటలకు కావాల్సిన పరికరాలు, పనిముట్లను కొనుగోలు చేసి కేంద్రాలను వినియోగంలోకి తెస్తున్నారు.
అందుబాటులో ఉన్న పనిముట్లు..
ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్ల ర్, టార్పాలిన్లు, పవర్ స్ప్రేయర్స్, సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్ డ్రిల్లర్ ట్రాక్టర్ ఆపరేటర్ తదితర పనిముట్లు, పరికరాలు కస్టమ్ హైరిం గ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా 29 జిల్లాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం శక్తికి మించి భారం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రైతులే 80 శాతం మంది ఉన్నారు. వీరికి యాంత్రీకరణను చేరువ చేయడంలో సీహెచ్‌సీలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. అలాగే పెట్టుబడులను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. అధిక విస్తీర్ణంలో పంటల సాగు కూడా సులభం కానుంది.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున..
సీహెచ్‌సీలకు మంచి స్పందన లభిస్తుండటంతో వీటి సేవలు విస్తరించాలన్న డిమాండ్ వస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతున్నారు. పట్టణ ప్రాంత సెగ్మెంట్లు మినహా.. గ్రామీణంలో ఉన్న సుమారు 75 నియోజకవర్గాల్లో త్వరలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 31 సెగ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందినట్లు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా ఏర్పాటయ్యే సీహెచ్‌సీలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లభించదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ పరికరాలు, పనిముట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయంలోంచి రుణాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను చూసుకోవాలి.
రైతులకు ఎంతో మేలు..
సీహెచ్‌సీలతో పేద, మధ్య తరగతి రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మహిళా సంఘాల ద్వారా మా వంతు సహకారం అందించనున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో అధికంగా వ్యవసాయం చేసే మూడు గ్రామాలను గుర్తించి యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఆరుగురు సభ్యులతో కూడిన ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశాం. ఫోన్ నంబర్లు ఇచ్చి ఒక సీసీతో పాటు అకౌంటెంట్‌ను పర్యవేక్షణకు నియమిస్తున్నాం. బయటి కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నాం.
– వట్నాల శ్యామల, రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment