వర్గల్(గజ్వేల్): వ్యవసాయ బావి వద్ద సంపుహౌజ్‌లో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు వెళ్లిన దంపతులు విద్యుత్ షాక్‌కు గురై అందులోనే పడి దుర్మరణం చెందారు. పెను విషాదం నింపిన ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదరిపల్లిలో జరిగింది. వ్యవసాయ క్షేత్రం వద్ద బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే..వర్గల్ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు మానుక వెంకటేశ్‌గౌడ్(30), రేణుక(26)లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శరత్ (7), తనూష(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి గ్రామానికి పక్కనే వర్గల్ శివారులో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ పనులు చేసేందుకు దంపతులిద్దరూ ఆదివారం ఉదయం 7 గంటలకు మొక్కజొన్న కంకులు తెంపేందుకు వెళ్లారు. పొలానికి వెళ్లేముందు పిల్లలిద్దర్నీ వెంకటేశ్ తల్లికి అప్పగించారు.
విక్రయానికి సరిపడా కంకులు కోసి ఆటోలో నింపి కాళ్లు, చేతులు కడుక్కునేందుకు దంపతులిద్దరూ వారి పొలంలోనే ఉన్న మోటారుపంపు దగ్గరకు వెళ్లారు. అప్పటికే మోటారు పంపు నుంచి వస్తున్న నీళ్లలో విద్యుత్ వస్తుండటంతో ఆవిషయం తెలియని దంపతులిద్దరూ అందులో కాలుపెట్టగానే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నీళ్ల కోసం వచ్చిన సమీప రైతు నీళ్లలో మునిగిపోయి కన్పిస్తున్న దంపతుల మృతదేహాలను చూసి కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారి తల్లిదండ్రులు, సోదరుడు, బంధుగణం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment