మాయదారి అలవాటు.. పిచ్చోళ్లు అవుతున్న పిలగాండ్లు | Youth And Teenagers Addicted To Mobile Phone Adilabad District | Sakshi
Sakshi News home page

పదే పదే ఫోన్‌.. రోగాలు, మానసిక ఒత్తిడితో పాటు అఘాయిత్యాలు! బయటపడే దారి ఇదే..

Published Wed, Jan 19 2022 5:47 PM | Last Updated on Wed, Jan 19 2022 9:26 PM

Youth And Teenagers Addicted To Mobile Phone Adilabad District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్‌: సాంకేతిక పరిజ్ఞానం మనిషిలోని సృజనాత్మకతను రోజురోజుకూ నీరు గారుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి సాంకేతికత ఆసరా తీసుకుని దానికి బానిస అవుతున్నాడు. మొబైల్‌ ఫోన్లకు అలవాటు పడుతున్న చిన్నారులు బయటి ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. యువత, టీనేజర్లు స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోయి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. శారీరక శ్రమ లేక బద్ధకం పెరిగి అనారోగ్యం బారిన పడిన ఆస్పత్రుల పాలవుతున్నారు.  


వినిపించని బామ్మల కథలు.. 
గతంలో చిన్నారులు పాఠశాల ముగియగానే ఇంటి వద్ద అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యల పంచన చేరేవారు. వారు చెప్పే పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్రం వంటి నీతి కథలను శ్రద్ధగా వినేవారు. దీంతో పిల్లల్లో వినికిడి సామర్థ్యం పెరగడంతోపాటు ఏకాగ్రత, శ్రద్ధ వంటి అంశాలు మెరుగుపడేవి. నీతి కథల ద్వారా నైతిక విలువలు నేర్చుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్నకుటుంబాలు పెరగడంతో పిల్లలకు కథలు చెప్పేవారు కరువయ్యారు. నేటి పిల్లలు పాఠశాల నుంచి రాగానే టీవీ, మొబైల్‌ ఫోన్‌లను వదలడం లేదు. మరోవైపు టీనేజ్‌ పిల్లలు, యువత మొబైల్‌ ఫోన్ల వాడకంతో అశ్లీలత వైపు అడుగులు వేస్తున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి విపరీత పోకడలు టీనేజ్‌ పిల్లలను నేరాలను చేయడానికి సైతం ఉసిగొల్పుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

పుస్తక పఠనంపై తగ్గిన ఆసక్తి.. 
డిజిటల్‌ లర్నింగ్, ఆన్‌లైన్‌ తరగతులు రాకతో రోజురోజుకూ పుస్తకం ప్రాధాన్యత తగ్గుతోంది. ఫలితంగా విద్యార్థులు పఠనంపై ఆసక్తి చూపడం లేదు. అరచేతిలోనే ప్రాపంచిక విషయాలు తెలుస్తుండటంతో లైబ్రరీలవైపు పిల్లల అడుగులు పడడం లేదు. ఫోన్లలో ఈ–బుక్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువసేపు వాటిని చూడటంతో చిన్నారుల కళ్లు త్వరగా అలిసిపోతున్నాయి. ఫలితంగా ఈ–బుక్‌ పఠనంలోనూ వారి ఆసక్తి సన్నగిల్లుతోంది. 

సరైన వినియోగంతోనే.. 
ఆధునిక యుగంలో మానవ జీవన వృద్ధి, అవసరాలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా కీలకం. విద్య, వైద్యం, నిర్మాణం, పారిశ్రామికం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా సర్వం సాంకేతికమయమే. విద్యాబోధన రంగాల్లో కూడా గణనీయ మార్పులు వచ్చాయి. సానుకూల ఫలితాలను ఇస్తున్న సాంకేతికత దుష్ప్రభావాలను సైతం చూపుతోంది. ఇదే విషయమై పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థుల శారీరక, మానసిక, నైతిక అభివృద్ధికి తోడ్పడాలని నిపుణులు సూచిస్తున్నారు. గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్లను పిల్లలకు ఇవ్వకుండా కట్టడి చేస్తూ, పుస్తక పఠనం, క్రీడలపై ఆసక్తి పెంచాలని సూచిస్తున్నారు. అప్పుడే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 

తగ్గిన శారీరక శ్రమ 
‘దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది’ అని ఒక మేధావి అంటాడు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకుంటే శారీరక సామర్థ్యం మానసిక స్థైర్యం పెరుగుదలకు ఉపయోగపడుతుంది అనే విషయం అర్థమవుతోంది. సాంకేతిక ఆధునిక యుగంలో పిల్లలు ఆటపాటలు, క్రీడలకు దూరం అవుతున్నారు. ఫలితంగా శారీరకంగా బలహీనులుగా మారి, మానసికంగా జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఏ చిన్న ఓటమి వచ్చినా కుంగుబాటుతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. 

వాస్తవిక ప్రపంచానికి దూరం 
మొబైల్‌ ఫోన్లను అధికంగా వినియోగించడంతో పిల్లలు వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్నారు. ఫైటింగ్‌ గేమ్స్, రేసింగ్‌ గేమ్స్‌ ఆడటంతో వారిలో సహనం క్రమక్రమంగా తగ్గిపోయి, ప్రతి విషయానికి ఉద్రిక్తతకు లోనవుతారు. టెక్‌ గ్యాడ్జెట్స్‌ అధికంగా వినియోగిస్తుండటంతో కమ్యూనికేషన్, సోషల్‌ స్కిల్స్‌ తగ్గిపోతాయి. పిల్లలకు శారీరక శ్రమ కలిగించే ఆటలు, క్రీడలపై ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 
– ఓంప్రకాశ్, మానసిక వైద్యనిపుణుడు

పిల్లలకు సమయం కేటాయించాలి 
మొబైల్‌ ఫోన్లను అధికంగా వాడుతుండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫోన్ల వాడకంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోతోంది. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లలకు మొబైల్‌ ఫోన్లను అందించే విషయంలో కట్టడి చేస్తూ.. వారికి కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు అనుబంధాలు, నైతిక విలువలను గుర్తించి జీవితంలో ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. 
– సాధన, డెప్యూటీ డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement