ముచ్చర్లలో రైతు రాగుల దేవయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న వై.ఎస్.షర్మిల
సిరిసిల్ల:రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో అప్పులు పుట్టక, ప్రైవేటు అప్పులు చేసి వడ్డీల భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు. గడిచిన 70 రోజుల్లో రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా మంగళవారం వైఎస్ షర్మిల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం ముచ్చర్లలో రాగుల దేవయ్య, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో మందాడి మల్లయ్య, ఇల్లంతకుంట మండలం జవారిపేటలో గౌరవేని రాజయ్య కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఎక్కడో హరియాణాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తానని ప్రకటించిన కేసీఆర్, రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించలేదన్నారు. వరి వేయొద్దని, వడ్లు కొనమని రైతులను గందరగోళానికి గురి చేసి వారి చావులకు సీఎం కేసీఆర్ కారణమయ్యారని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేని కేటీఆర్, నేను పరామర్శకు వస్తే అడ్డంకులు కల్పించారని,బాధిత కుటుంబాలను బెదిరించారని షర్మిల ఆరోపించారు. రైతులకు భరోసా ఇవ్వలేని మంత్రి పదవి, సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment