ప్రభుత్వ ఉద్యోగిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Published Sun, Jul 2 2023 11:12 AM | Last Updated on Sun, Jul 2 2023 11:13 AM

- - Sakshi

సాక్షి, అమరావతి: కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టి కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ పిటిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీని అడ్డుకునేందుకు అధికారులపై అతను దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేగాక రూ.25 వేలను ఖర్చుల కింద చెల్లించాలని, ఆ మొత్తాన్ని నాలుగు వారాల్లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరు మీద జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

సర్వీసు నుంచి తొలగింపుపై పిటిషన్‌
తిరుపతి జిల్లా, నాయుడుపేటకు చెందిన అంబటి శ్రీనివాసులు నాయుడు ఏపీ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) ఉద్యోగి. ఇతన్ని సస్పెండ్‌ చేస్తూ అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ మెమో జారీచేశారు. దాన్ని సవాలు చేస్తూ శ్రీనివాసులు నాయుడు గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ ఆ మెమోను సస్పెండ్‌ చేస్తూ పిటిషనర్‌ శ్రీనివాసులు నాయుడిని ఉద్యోగం చేసుకోనివ్వాలంటూ ఏపీఎస్‌పీడీసీఎల్‌ అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం శ్రీనివాసులు నాయుడును ఉద్యోగంలోకి తీసుకున్న అధికారులు అతన్ని ఉదయగిరికి బదిలీ చేశారు.

పోస్టింగ్‌ ఉత్తర్వుల గురించి పిటిషన్‌లో ఎక్కడా చెప్పలేదు
శ్రీనివాసులు నాయుడు తరఫు న్యాయవాది ఆర్‌.సుధీర్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందువల్ల అతన్ని ఉదయగిరికి బదిలీ చేయడం తగదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌, అనారోగ్య సమస్యలన్నవి పూర్తిగా వేరని, వాటిని ప్రస్తుత కోర్టు ధిక్కార పిటిషన్‌లో విచారించజాలమని తేల్చిచెప్పారు.

పోస్టింగ్‌ ఆర్డర్‌ను నేరుగా తీసుకునేందుకు పిటిషనర్‌ నిరాకరించడం, రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఆ ఆర్డర్‌ను అందుకున్న విషయాన్ని దాచిపెట్టడం అన్నదే ఇక్కడ ప్రధాన విషయమన్నారు. శ్రీనివాసులు నాయుడు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారని న్యాయమూర్తి తేల్చారు. ఈ మేరకు రూ.25వేలను ఖర్చుల కింద చెల్లించాలని శ్రీనివాసులు నాయుడును న్యాయమూర్తి ఆదేశించారు.

కోర్టు ఆదేశాలను గౌరవించి విధుల్లోకి తీసుకున్నాం
ఇదిలా ఉంటే కార్పొరేషన్‌ అధికారులు కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ శ్రీనివాసులు నాయుడు వారిపై హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో ఏపీఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్‌, ఎండీ కె.సంతోష్‌రావు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ బి.వెంకట సుబ్బయ్య, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జె.కృష్ణ ప్రసాద్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సుధాకర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణప్రసాద్‌ ప్రతివాదులుగా ఉన్న అధికారులకు నోటీసులు జారీచేశారు.

ఇటీవల ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్‌ తరఫు న్యాయవాదులు కొవ్వూరి వెంకట్రామిరెడ్డి, అభయ్‌ జైన్‌ వాదనలు వినిపిస్తూ, కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్‌ శ్రీనివాసులు నాయుడును విధులోకి తీసుకుని అతన్ని ఉదయగిరికి బదిలీ చేశారని తెలిపారు. పోస్టింగ్‌ ఆర్డర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పిటిషనర్‌కు అందచేయగా, ఆ ఆర్డర్‌ను నేరుగా తీసుకునేందుకు అతను నిరాకరించారని, దీంతో 7వ తేదీన రిజిస్టర్‌ పోస్టు ద్వారా పోస్టింగ్‌ ఆర్డర్‌ పంపగా, దాన్ని 8వ తేదీన అందుకున్నారంటూ, ఇందుకు సాక్ష్యంగా పోస్టల్‌ శాఖ ట్రాకింగ్‌ రిపోర్ట్‌ను వారు కోర్టు ముందుంచారు.

బదిలీ తర్వాతవాత కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన శ్రీనివాసులు నాయుడు అధికారులు ఇచ్చిన పోస్టింగ్‌ ఆర్డర్‌ గురించి తన పిటిషన్‌లో పేర్కొనలేదని వెంకట్రామిరెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కోర్టు ముందు వాస్తవాలను దాచిపెట్టడమే అవుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement