సామాన్య భక్తులకే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులకే ప్రాధాన్యం

Published Mon, Jul 17 2023 12:38 AM | Last Updated on Mon, Jul 17 2023 12:38 AM

 డయల్‌ యువర్‌ ఈఓలో మాట్లాడుతున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి   - Sakshi

డయల్‌ యువర్‌ ఈఓలో మాట్లాడుతున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

తిరుమల : శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తున్నట్లు టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమల అన్నమ య్య భవన్‌లో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈఓ మాట్లాడుతూ నాదనీరాజనం వేదికపై ఈ నెల 3వ తేదీ నుంచి శ్రీమద్భాగవత ప్రవచనం సాగుతోందన్నా రు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోందని వెల్లడించారు. శ్రీ కుప్పా విశ్వనాథశర్మ చేపట్టిన ప్రవచనానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. అనంతరం భక్తులతో ఫోన్‌లో మాట్లాడారు..

ప్రవీణ్‌ కుమార్‌, మహారాష్ట్ర : అంగప్రదక్షిణ టోకెన్లను ఆఫ్‌లైన్‌లో కూడా ఇవ్వండి.

ఈఓ : భక్తుల సౌకర్యార్థమే ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు జారీ చేస్తున్నాం.

● స్వామి, అనంతపురం : శ్రీవారి సేవకు వచ్చాం. ఫోన్‌ నంబర్‌ మార్చాలని విజ్ఞప్తి చేశాం. అయితే కొత్త నంబర్‌ నమోదు చేసుకోవడం వీలుకాలేదు.

ఈఓ : తప్పకుండా మారుస్తాం.

శంకర్‌ గౌడ్‌, హైదరాబాద్‌ : 3 నెలల ముందుగా రూ.300 దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు. మహిళలకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక నెల ముందు మాత్రమే విడుదల చేస్తే బావుంటుంది.

ఈఓ : ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు 3 నెలల ముందుగా రూ.300 దర్శన టికెట్లు విడుదల చేస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు సంబంధించి 4 వేల టికెట్లను అదనంగా విడుదల చేస్తాం.

దుర్గాప్రసాద్‌, అనకాపల్లి : లక్కీ డిప్‌లో ఆర్జిత సేవా టికెట్లు దొరకడం లేదు.

ఈఓ : లక్కీ డిప్‌లో ఆర్జిత సేవా టికెట్లు తక్కువగా ఉన్నాయి. స్వామివారిని ప్రార్థించి ప్రయత్నించండి.

హరి, మంచిర్యాల : సీనియర్‌ సిటిజన్లకు కాటేజీల్లో గ్రౌండ్‌ ఫ్లోర్‌ వచ్చేలా చూడండి.

ఈఓ : రిసెప్షన్‌ అధికారులకు ఈ మేరకు ఆదేశాలిస్తాం.

మనోహర్‌, జగిత్యాల : తలనీలాలు సమర్పించే ప్రాంతంలో క్షురకులు డబ్బులు అడగకుండా కంట్రోల్‌ చేయండి.

ఈఓ : భక్తులు ఎవరూ డబ్బులు ఇవ్వకపోతేనే సమస్య పరిష్కారం అవుతుంది. క్షురకులు డబ్బులు తీసుకుంటున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. వారికి తరచూ కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నాం.

కర్నూలు, రతీదేవి : శ్రీవారి సేవకులకు సేవాసదన్‌లో అన్నప్రసాదాలు అందించండి.

ఈఓ : శ్రీవారి సేవకుల కోసం వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రత్యేకంగా హాలు కేటాయించాం. సేవాసదన్‌లో కూడా అన్న ప్రసాదాలు అందించే విషయాన్ని పరిశీలిస్తాం.

రవికుమార్‌, బెంగళూరు, సుహాసిని, నంద్యాల : బంగారు వాకిలి వద్ద టీటీడీ సిబ్బంది భక్తులను లాగేస్తున్నారు. భక్తులకు ఇబ్బందిగా ఉంది.

ఈఓ : భక్తులందరికీ సంతృప్తికరంగా దర్శన భాగ్యం కల్పించేందుకు మహద్వారం నుంచి గర్భాలయం వరకు ఒకే వరుస విధానాన్ని అమలు చేస్తున్నాం.

రెడ్డి, రాయచోటి : తిరుపతి రైల్వే స్టేషన్‌, విష్ణునివాసం వద్ద భిక్షకులు, అపరిచిత వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉంది. విష్ణునివాసంలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లకు సంబంధించి సూచిక బోర్డు లేదు.

ఈఓ : రైల్వే స్టేషన్‌, విష్ణు నివాసం ప్రాంతాల్లో భిక్షకులు, అపరిచిత వ్యక్తుల సంచారంపై జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తాం. విష్ణు నివాసంలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లకు సంబంధించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం.

మణికంఠ, పలమనేరు : లడ్డూ కౌంటర్‌ వద్దకు కుటుంబ సభ్యులందరూ వెళితేనే లడ్డూలు ఇస్తున్నారు. లేకపోతే ఇవ్వడం లేదు.

ఈఓ : దళారులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. భక్తులు సహకరించగలరు.

మునిలక్ష్మి, నెల్లూరు : ఆర్జిత సేవలు, వర్చువల్‌ సేవలు ఒకేరోజు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వేర్వేరు రోజుల్లో విడుదల చేస్తే సౌకర్యంగా ఉంటుంది.

ఈవో: పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

శ్రీరామ్‌, విశాఖ : వికలాంగులు, వృద్ధులను ఒకేసారి కాకుండా వేర్వేరుగా దర్శనానికి పంపితే బావుంటుంది.

ఈవో : అలాగే పంపుతాం.

హనుమంతరావు, గుంటూరు : తిరుమలలో గది తీసుకున్నాం. డిపాజిట్‌ రీఫండ్‌ రాలేదు.

ఈఓ : మీకు ఫోన్‌ చేసి రీఫండ్‌ వివరాలు తెలియజేస్తాం.

వేణుగోపాల్‌, హైదరాబాద్‌ : ఎస్వీబీసీ తెలుగు ఛానల్‌లో ఇతర భాషల కార్యక్రమాలను నిలుపుదల చేయండి.

ఈఓ : భక్తులకు సౌకర్యంగా ఉండేలా కార్యక్రమాలు ప్రసారం చేస్తాం.

రాజు, వనపర్తి : శ్రీవారి మెట్టు మార్గంలో లగేజ్‌ డిపాజిట్‌ చేసి నడిచి వచ్చాం. తిరుమలలో తిరిగి తీసుకోవడం ఇబ్బందిగా మారింది.

ఈఓ : లగేజ్‌ కలెక్షన్‌, డెలివరీ సిస్టం పేరుతో నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఈ వ్యవస్థలో క్యూఆర్‌ కోడ్‌ స్లిప్‌ జారీ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లగేజీ అందజేస్తాం.

ఈశ్వర్‌ ప్రసాద్‌, ఐరాల : శ్రీవారి మెట్టు మార్గంలో అల్పాహారం కోసం దుకాణాల వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

ఈఓ : అధిక ధరలు వసూలు చేస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకుంటాం. శ్రీవారి మెట్టు మార్గం మొదట్లోనే అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

మధు కులకర్ణి, కర్ణాటక : తిరుమలలో గదులు పొందిన భక్తులు మరో రెండు రోజులు పొడిగించుకునే అవకాశం కల్పించండి.

ఈఓ : తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉంది. ఎక్కువమంది భక్తులకు అవకాశం కల్పించాలి కాబట్టి 2 రోజులు పొడిగించుకునే అవకాశం లేదు.

వెంకటరమణమూర్తి, హైదరాబాద్‌ : ఎన్నారై భక్తురాలు దర్శన టికెట్‌ కోసం ప్రయత్నిస్తే ఇవ్వలేదు.

ఈఓ : ఎన్నారైలు తమ అర్హతను చూపితే రూ.300 టికెట్‌ జారీచేసి స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం.

రామిరెడ్డి, కర్నూలు : కర్నూలులో శ్రీవారి లడ్డూలు పొందే అవకాశం కల్పించండి.

ఈఓ : హైదరాబాదుకు లడ్డూలు తీసుకువెళ్లే వాహనం ద్వారా కర్నూలులో ప్రయోగాత్మకంగా వెయ్యి లడ్డూలతో ఈ సౌకర్యం కల్పిస్తాం.

కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఈ–2 జగదీశ్వర్‌ రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీదేవి, అన్న ప్రసాదం ప్రత్యేకాధికారి శాస్త్రి, వీజీఓ బాలిరెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement