సాక్షి, తిరుపతి : ఆ సామాజిక వర్గం నేతలకు టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీలోని కమ్మ, కాపు, యాదవ సామాజిక వర్గం వారు విడిపోయి కుమ్ములాడుకుంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తిరుపతి, వెంకటగిరి అసెంబ్లీ టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరింది. తిరుపతి జిల్లాలో కీలకమైన తిరుపతి, వెంకటగిరి టికెట్ల విషయంలో ఇటు టీడీపీలోని కమ్మ, అటు జనసేన నుంచి కాపు సామాజిక వర్గం మధ్య విభేదాలు అధినేతలకు తలనొప్పిగా మారాయి. తిరుపతి అసెంబ్లీ టికెట్ జనసేన కోరుకుంటున్న విషయం తెలిసిందే.
చిరంజీవి గతంలో తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. పొత్తులో భాగంగా జనసేన ఇదే స్థానాన్ని అడుగుతోంది. టీడీపీ అధినేత కూడా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయిస్తానని పవన్‌కు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబు హామీ ఇవ్వడంతో పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్ ఎవరికి వారు తనకే టికెట్ అని ధీమాగా ఉన్నారు. మరో వైపు చంద్రబాబు తిరుపతి లాంటి కీలకమైన టికెట్ జనసేనకు కేటాయించడం ఇష్టం లేక మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇప్పించేందుకు పథకం రచించారు. సుగుణమ్మకు జనసేన కండువా కప్పించి తన మనిషి అయిన ఆమెనే అభ్యర్థిగా ప్రకటించాలని బాబు ప్లాన్. ఈ పరిస్థితుల్లో తిరుపతి జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలు జనసేనకు షాక్ ఇచ్చారు.
జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉన్నాయని, ఈ సారైనా తిరుపతి అసెంబ్లీ టికెట్ తమ వారికే కేటాయించాలని చంద్రబాబుని కలిసి డిమాండ్ చేసినట్లు సమాచారం. వెంకటగిరి సభ అయ్యాక కమ్మ సామాజిక వర్గం నేతలంతా కలిసి పరిస్థితిని బాబుకు వివరించినట్లు తెలిసింది.తిరుపతిలో జనసేనకు కేడర్ లేదని, కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉన్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఏ రోజూ కమ్మ సామాజిక వర్గం వారికి విలువ ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఆమెకే టికెట్ ఇస్తే తమని మతించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది.
ఆమెకు ఇస్తే ఎట్టిపరిస్థితుల్లో తామెవ్వరూ పనిచేయమని కమ్మ సామాజిక వర్గం నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఈ సారి తిరుపతి టికెట్ కమ్మ వారికే ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలంతా డిమాండ్ చేసినట్లు తెలిసింది. మరో వైపు యాదవ సామాజిక వర్గం నేతలు తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్‌ను తిరుపతి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నరసింహయాదవ్ మొదటి నుంచి టీడీపీ జెండా మోస్తున్న వ్యక్తి అని గుర్తు చేసినట్లు సమాచారం.
వెంకటగిరి కోటలో రచ్చ
తిరుపతి జిల్లా వెంకటగిరిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చంద్రబాబు సమక్షంలోనే ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డిని అవమానించిన విషయం తెలిసిందే. వెంకటగిరిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణకే టికెట్ కేటాయించాలనే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన ఆనం రాంనారాయణరెడ్డిని ప్రసంగించకుండా మాజీ ఎమ్మెల్యే అనుచరులు కేకలు వేస్తూ శుక్రవారం నాటి సభలో అడుగడుగునా అడ్డుపడిన విషయం తెలిసిందే.
మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మస్తాన్ యాదవ్ వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు సభకు మస్తాన్ యాదవ్ భారీ ఏర్పాట్లు చేశారు. తమ సామాజిక వర్గం వారందరినీ వాహనాల్లో తరలించి బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. శ్రీఏడుకొండల స్వామి పాదపద్మాల కింద ఉన్న తిరుపతి జిల్లాలో యాదవ సామాజిక వర్గం ఓట్లు అధికంగానే ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా తిరుమలలో సన్నిధి గొల్లకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి లేదా వెంకటగిరిలో ఏదో ఒక స్థానాన్ని యాదవ సామాజిక వర్గం వారికి కేటాయించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. లేకపోతే ఎన్నికల్లో పనిచేయలేమని తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment