పుంగనూరులో విషాదం
● ఎస్‌ఎస్ ట్యాంకులో తేలిన బాలిక మృతదేహం ● నాలుగు రోజుల పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకని వైనం
మానవత్వం మంటగలిసింది. ముక్కుపచ్చలారని పసిబిడ్డను పైశాచికత్వం కబళించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను తీరని శోకంలో ముంచేసింది. పుంగనూరులో ఏడేళ్ల బాలిక అదృశ్యమైన ఘటన చివరకు విషాదాంతంగా మారింది. నాలుగు రోజుల ఎదురుచూపులకు నిర్వేదమే మిగిలింది. బుజ్జితల్లిని విగతజీవిగా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో చూసి ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. అభం శుభం తెలియని బాలికను పాశవికంగా హతమార్చడంపై ఆవేదనతో నిండిపోయింది.
అశ్వియ అంజుమ్ మృతదేహాన్ని వెలికి తీయిస్తున్న పోలీసులు
అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో హాజరైన పుంగనూరు వాసులు (ఇన్‌సెట్) అశ్వియఅంజుమ్ (ఫైల్)
పుంగనూరు : పట్టణంలోని యూబీ కాంపౌండుకు చెందిన అజ్మతుల్లా కుమార్తె అశ్వియఅంజుమ్ (7) గత నెల 29న రాత్రి 7 గంటల సమయంలో పక్కింటిలో ఆడుకునేందుకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు పుంగనూరుకు చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో పోలీస్ జాగిలాలను చిత్తూరు, రాయచోటి నుంచి తెప్పించారు. బాలిక ఇంటి నుంచి ఉబేదుల్లా కాంపౌండులోని పలు వీధుల్లో పరుగులు తీసిన పోలీస్ జాగిలాలు చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్ద ఆగిపోయాయి. తిరిగి రెండో సారి ఇంటి నుంచి జాగిలాలతో పరిశీలన చేపట్టారు. రెండవ సారీ అదే ప్రాంతంలోకి వచ్చి ఆగిపోవడంతో పోలీసులు, వందల సంఖ్యలో ముస్లిం యువకులు కలసి ముళ్లపొదల్లో గాలింపు చేపట్టారు. కానీ బాలిక ఆచూకీ లభించలేదు. పట్టణంలోని సీసీ కెమెరాలలోని డేటాను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మంగళవారం రాత్రి అనంతపురం డీఐజీ హిమోషి బాజ్‌పాయ్ పుంగనూరు చేరుకుని ఎస్పీతో కేసు దర్యాప్తుపై చర్చించి, పలు సూచనలు చేసి వెళ్లారు.
బాలిక ఒంటిపై గాయాలు
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై పడి ఉన్న అశ్వియ అంజుమ్ దుస్తులపై రక్తపు మరకలు, ఒంటిపై గాయాలు ఉన్నట్లు శవాన్ని వెలికితీసిన ముస్లిం యువకులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలికను కిడ్నాప్ చేసి చెంగలాపురం ముళ్లపొదల్లోకి తీసుకొచ్చి అక్కడ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడవేసి ఉంటారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే ప్రాంతంలో పోలీస్ జాగిలాలు రెండు సార్లు వచ్చి ఆగిపోవడం గమనార్హం. దీనిని బట్టి దుండగులు బాలికను అక్కడికి తీసుకొచ్చి తరువాత కారులో కానీ, ఆటోలో కానీ వెళ్లి ఉంటారని, దీని కారణంగా జాగిలాలు ఆచూకీ కనుగొనడంలో విఫలమయ్యాయన్న భావన వ్యక్తమవుతోంది.
దర్యాప్తు ఇలా...
బాలిక అశ్వియఅంజుమ్ అదృశ్యమైందనే కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. బాలిక తండ్రి అజ్ముతుల్ల వడ్డీవ్యాపారి కావడంతో పోలీసుల దర్యాప్తు ఆ కోణంలో సాగింది. కానీ పోలీసులకు నాలుగురోజుల్లో చిన్న క్లూ కూడా లభించలేదు. చిన్నారిని కిడ్నాప్ చేసిన అగంతకుల ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. పోలీసుల దర్యాప్తు పట్టణానికే పరిమితమైంది. కానీ చిన్నారి ఇంటికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో చిన్నారి మృతదేహం లభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే, ఎంపీ పరామర్శ
ఈ విషాదకర ఘటన సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఫోన్ ద్వారా అజ్మతుల్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలిక మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అశ్రునయనాలతో అంత్యక్రియలు
చిన్నారి అశ్వియఅంజుమ్ మృతదేహానికి స్థానిక ఆస్పత్రిలో ఎస్పీ మణికంఠ చందవోలు, జేసీ విద్యాధరి ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆస్పత్రికి సమీపంలోని ముస్లింల శ్మశాన వాటికలో బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. వేలాది మంది ముస్లింల కన్నీటితో బాలికకు వీడ్కోలు పలికారు. ఈ ఘటన స్థానికుల గుండెలను కలచివేసి పట్టణాన్ని విషాదంలో ముంచింది.
గంజాయి బ్యాచ్ పనేనా?
పట్టణంలోని చెంగలాపురం, భగత్‌సింగ్ కాలనీ, దోబీ కాలనీ, కోనేటిపాళెం, ఎన్‌ఎస్.పేట ప్రాంతాల్లో గంజాయి, మత్తు పదార్థాలు అధికంగా లభిస్తున్నాయి. యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు మత్తులో బాలికను కిడ్నాప్ చేసి, చెంగలాపురం ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
ఆర్థిక లావాదేవీలైతే..
అజ్ముతుల్లా వడ్డీ వ్యాపారిగా ఉన్నప్పటికీ లావాదేవీల వ్యవహారమైతే బాలికను కిడ్నాప్ చేసి సొమ్ము డిమాండ్ చేసి ఉండేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్తవాళ్లు బాలికను తీసుకెళ్లే అవకాశం లేదని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. తెలిసినే వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment