వివాదాలకు కేరాఫ్ వెటర్నరీ
● వర్సిటీలో స్తంభించిన పాలన
● 24రోజులుగా తరగతులకు హాజరుకాని విద్యార్థులు
● సమ్మె విరమణ ససేమిరా అంటున్న జూడాలు
తిరుపతి సిటీ : ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. గత ఏడు నెలలుగా వర్సిటీలో అధికారులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీ అనుబంధంగా నడుస్తున్న పశువైద్య కళాశాలల్లో అధ్యాపకుల బదిలీలు నిర్వహించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. గరివిడి కళాశాలను కేంద్ర బృందం తనిఖీ చేసిన సమయంలో వర్సిటీ అధికారుల హడావుడి బదిలీలపై ఆరోపణలు వినిపించాయి. అలాగే వర్సిటీ ఆవరణలోని మహిళ, పురుషుల వసతి గృహాలలో మౌలిక సదుపాయలు లేకపోవడం, నాసిరకం భోజనం అందించడంతో విద్యార్థులతు మెరుపు సమ్మెకు దిగిన సంఘటనలు కోకొల్లలు. అలాగే ఔట్‌సోర్సింగ్, వర్క్ కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కరించకపోవడంతో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ఉద్యోగులు పలు మార్లు నిరసన తెలిపారు. నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కనీసం నెలరోజులు గడవకుండానే దీర్ఘకాలిక లీవులో ఉండడం వంటి ఎన్నో సమస్యలు వర్సిటీని వేధిస్తున్నాయి. కానీ, అధికారులు అవేమీ తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తూ గ్రూపు రాజకీయాలను నడుపుతూ పబ్బం గడుపుతన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల వ్యవహారశైలిపై వర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటూ ఉండడం గమనార్హం.
తరగతుల బహిష్కరణ..పట్టించుకోని అధికారులు
వెటర్నరీ వర్సిటీలో పశువైద్య విద్యార్థులు తమ గౌరవ వేతనం పెంచాలని గత 24 రోజులుగా తరగతులను బహిష్కరించారు. రోడ్డెక్కి సమ్మెకు దిగారు. అయినప్పటికీ వర్సిటీ అధికారుల్లో చలనం లేకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు పలువురు మంత్రులను నేరుగా కలసి తమ గోడును విన్నవించుకున్నా స్పందన కరువైందని వెటర్నరీ జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సమ్మె విరమించాలని అధికార పార్టీకి చెందిన విద్యార్థి సంఘాల నేతలతో ఒత్తిడి చేయిస్తుండడంపై మండిపడుతున్నారు. తమ ఆందోళనను నిర్వీర్యం చేసేందుకు వర్సిటీ అధికారులు కుట్రలు పన్నుతున్నారని వాపోతున్నారు. గౌరవ వేతనం పెంచే వరకు నిరసన కొనసాగుతుందని, అడ్డుకునేందుకు యత్నిస్తే ప్రాణ త్యాగానికై నా సిద్ధమని హెచ్చరిస్తున్నారు.
పశువైద్య విద్యార్థుల
గౌరవ వేతనం వివరాలు
బీవీఎస్సీ 7వేలు
ఎంవీఎస్సీ 10వేలు
పీహెచ్‌డీ 12వేలు
బీవీఎస్సీ 25వేలు
ఎంవీఎస్సీ 50వేలు
పీహెచ్‌డీ 75వేలు
ఆరోపణలు సత్యదూరం
వెటర్నరీ విద్యార్థులు కొంతకాలంగా సమ్మెలో ఉన్నారు. వారి సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సమస్యపై చర్చిస్తున్నాం.విద్యాసంవత్సరం ముగింపు దశలో ఇలా విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం సరికాదు. వెంటనే తరగతులకు హాజరుకావాలి. వర్సిటీలో పాలన సజావుగా సాగుతోంది. రాజకీయాలు, వివాదాలంటూ వస్తున్న ఆరోపణలు సత్యదూరం. విద్యార్థుల శ్రేయస్సు, వర్సిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – జేవీ రమణ, ఇన్‌చార్జి వీసీ, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ
వివాదాలకు కేరాఫ్ వెటర్నరీ
వివాదాలకు కేరాఫ్ వెటర్నరీ
Comments
Please login to add a commentAdd a comment