సీఎం పర్యటనపై సమీక్ష
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికారులంతా సమయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. సమీక్షలో ఎయిర్‌పోర్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే, ఏఎస్పీ శ్రీనివాస రావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ బాలాజీ నాయ క్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, విమానాశ్రయ అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల సరఫరా పెంచండి
తిరుపతి మంగళం : ఖరీఫ్, రబీ సీజన్‌ల కోసం అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు గురువారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. 2024–25లో 1,19,141 మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించినట్టు తెలిపారు. 2025–26 సంవత్సరానికిగాను మరో 25 శాతం పెంచాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం 258 ప్రైవేట్ డీలర్లు, 36 వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని, పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా డీలర్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని కోరారు. రైతుల ఉత్పాదకత పెంపు, ఆహార భద్రత లక్ష్యాలను సాధించేందుకు సరఫరా పెంపు ఎంతో కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు.
3 నుంచి ఆకాశవాణిలో
టెన్త్ విద్యార్థులకు కార్యక్రమం
తిరుపతి కల్చరల్ : పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు సబ్జెక్టుల వారిగా మార్చి 3వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు పస్రారం చేయనున్నట్టు ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ ఎం.సుధాకర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం మార్చి 3 నుంచి 9వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 7.15 గంటలకు తిరుపతి ఎఫ్‌ఎం 103.2, 107.5, మెగా హెమ్ స్టేజ్‌పై వినవచ్చని పేర్కొన్నారు. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్‌పై కూడా వినవచ్చని తెలిపారు. ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి విషయ నిపుణులైన ఉపాధ్యాయులు వివిధ అంశాలను వివరిస్తారని వెల్లడించారు. పరీక్షలకు ఆందోళన లేకుండా ఎలా సిద్ధం కావాలి అనే అంశాలను తెలియజేస్తారని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీఎం పర్యటనపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment