శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 62,323 మంది స్వామిని దర్శించుకున్నారు. 20,460 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.92 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఎస్వీయూ దూరవిద్యకు అనుమతులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే కోర్సులకు 2024 – 25 సంవత్సరానికి యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనుమతులు మంజూరు చేసింది. జనవరిలో యూజీసీ నిపుణుల బృందం వర్సిటీలో మూడు రోజులు పర్యటించింది. అనుమతుల మంజూరుకు సంబంధించిన అర్హతలపై యూజీసీకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో యూజీసీ గురువారం ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు 2024–25 విద్యా సంవత్సరం నుంచి అనుమతులు మంజూరు చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో వర్సిటీ డీడీఈ విభాగంలో 17 కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా డీడీఈ కోర్సుల పునరుద్ధరణకు, అనుమతులు రావడానికి కృషి చేసిన వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి వీసీ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment