ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్త కావాలి
ఏర్పేడు(రేణిగుంట): దేశంలో సైన్స్ ప్రపంచదేశాలకు ధీటుగా అభివృద్ధి చెందటం శాస్త్రవేత్తల వల్లే సాధ్యమైందని, ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్తగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్యతో కలిసి విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. శాస్త్రవేత్తలు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచం గర్వించే గొప్ప శాస్త్రవేత్త సీవీ రామన్ అని, తాను ఎనిమిదో తరగతిలో ఖగోళ శాస్త్రవేత్త కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఐసర్ విద్యార్థులు అబ్బురపరిచే ప్రయోగాలను రూపొందించి ప్రదర్శించారని అభినందించారు. కలెక్టర్ తన బాల్య జ్ఞాపకాలను పంచుకుంటూ.. తాను ఆకాశంలో నక్షత్రాలు, రాశులను చూసి ఆనందించేవాడినని, ఆస్ట్రోఫిజిసిస్ట్ కావాలని కలలు కన్నానని తెలిపారు. ఎంబీబీఎస్ పట్టా పొంది విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లో పనిచేశానని, తర్వాత ఐఏఎస్ అయ్యానని తెలిపారు. ఐసర్ విద్యార్థులు సుమారు 100కు పైగా నమూనాలను ప్రదర్శించారు. వాటిని తిలకించేందుకు ఏర్పేడు, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, వేదాంతపురం, శ్రీసిటీల నుంచి 800 మంది విద్యార్థులు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment