
రెండు నెలలుగా అందని ఉపాధి బిల్లులు
● అష్టకష్టాలు పడుతున్న పేదలు ● అర్ధాకలితో అలమటిస్తున్న కూలీలు
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
చిల్లకూరు: ఉపాధి కూలీలు పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. రెండు నెలలుగా కూలీలు అందకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు కూలికి వెళ్లి పొట్ట పోసుకునే వారికి ఇబ్బందికరంగా మారింది. కొంతమంది అప్పులు చేసి పొట్టపోసుకుంటుండగా మరికొందరు అర్ధాకలితో అలమటిస్తున్నట్టు తెలుస్తోంది.
రోజుకు రూ.60 లక్షలు
జిల్లాలో రోజుకు 30 వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.200 చొప్పున ఒక రోజుకు కనీసం రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కూలీకి రెండు నెలలకు కలిపి రూ.12 వేల వరకు కూలీలు రావాల్సి ఉంది.
కూటమి నేతలు హంగు, ఆర్భాటాలకు పోయి ఉపాధి కూలీలను కష్టాల్లోకి నెట్టేశారు. పల్లెపండుగ పేరుతో ఇష్టారాజ్యంగా భోంచేశారు. సీసీ రోడ్లు, డ్రైన్లు అంటూ హంగామా సృష్టించారు. ఆపై ఉపాధి కూలీలకు నిధులు లేకుండా మింగేశారు. రెండు నెలలుగా పనిచేస్తున్నా ఉపాధి డబ్బులు రాక కూలీలు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. దీనిపై అధికారులు సైతం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లా సమాచారం
మండలాలు 33
పంచాయతీలు 806
జాబ్ కార్డులు 2.68 లక్షలు
వాస్తవ కూలీల సంఖ్య 4.62 లక్షలు
యాక్టివ్ జాబ్ కార్డులు 2.25 లక్షలు
ప్రస్తుతం ఒక రోజుకు హాజరవుతున్న
కూలీల సంఖ్య 42 వేల మంది
నిధుల విడుదలలో జాప్యం ఎందుకో?
కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ నిధులను కూటమి ప్రభుత్వం కొత్తగా పల్లె పండుగ పేరుతో ఆర్భాటం చేసింది. తమ నాయకులకు కట్ట బెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసి ఖర్చుచేసింది. సీసీ రోడ్లు, డ్రైన్లు అంటూ హంగామా సృష్టించింది. అలాగే కొత్తగా ఇంకుడు గుంతలను నిర్మించేందుకు తమ నాయకులకు పనులు అప్పగించింది. దీంతో ఈ నిధులు దుర్వినియోగమవడంతో కూలీలు కడుపు మాడ్చుకోవాల్సి వస్తోంది.
పైసా ఇవ్వలేదు
నేను ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో వారానికి ఓ సారి డబ్బు పడేది. ఇప్పుడు రెండు నెలలుగా కూలీలు ఇవ్వలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఉపాధి పనులు ముగించేసి వ్యవసాయ పనులకు వెళ్దామంటే అవి కూడా లేవు. పిల్లల్ని ఎలా పోషించాలో తెలియడం లేదు.
– కుమార్, చిట్టమూరు, ఉపాధి కూలీ
మార్చి నెలాఖరులోగా చెల్లిస్తాం
ఉపాధి హామీ పథకంలో పనికి వచ్చే ప్రతి కూలీకి మార్చి నెలాఖరులోగా నగదు చెల్లిస్తాం. గత రెండు నెలలుగా కూలీలకు నగదు చెల్లింపులు జరగలేదు. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించాం. వెంటనే నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. – వరప్రసాద్,
ఏపీడీ, డ్వామా, గూడూరు

రెండు నెలలుగా అందని ఉపాధి బిల్లులు
Comments
Please login to add a commentAdd a comment