ఖద్దరు బేరం! | - | Sakshi
Sakshi News home page

ఖద్దరు బేరం!

Published Sun, Mar 2 2025 1:10 AM | Last Updated on Sun, Mar 2 2025 1:10 AM

-

ఖాకీ పోస్టింగ్‌లకు..
ఇప్పటికీ పోలీసుల బదిలీలపై స్పష్టత కరువు
● ప్రజాప్రతినిధుల లెటర్‌ ఉంటే పోస్టింగ్‌ ● బేరసారాలు సాగిస్తున్న నేతలు ● కీలకమైన పోలీస్‌ స్టేషన్‌కు రూ.20 లక్షలకు పైగా డిమాండ్‌ ● ఆదాయవనరులున్న స్టేషన్లకు పోటాపోటీ

తిరుపతి క్రైమ్‌: కూటమి ప్రభుత్వంఏర్పడి సుమారు ఎనిమిది నెలలు గడుస్తున్నా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తమకు అనుకూలమైన స్థానాల కోసం ప్రజాప్రతినిధు ల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. తిరుపతిలో ఇప్పటికే అన్ని పోలీస్‌ స్టేషన్లలో బదిలీల ప్రక్రియ ముగిసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ పలు పోస్టింగులు అటాచ్‌మెంట్‌ పైన నడుస్తున్నాయి. జిల్లా పరిధిలోనే అత్యంత కీలకమైన పోలీస్‌ స్టేషన్‌ అయిన ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ కూడా అటాచ్‌మెంట్‌ మీద నడుస్తోంది. ఇక్కడ పని చేస్తున్న సీఐని గత ఎస్పీ సుబ్బరాయుడు హయాంలో బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోలీస్‌ స్టేషన్‌ను వెస్ట్‌ సీఐకి అటాచ్‌మెంట్‌ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. కొద్దిరోజుల అనంతరం వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు మరో సీఐని అటాచ్‌మెంట్‌ ఇస్తూ అప్పటి ఎస్పీ మరోసారి ఆదేశాలు జారీచేశారు. అప్పటి నుంచి ఈ పోలీస్‌ స్టేషన్‌ అటాచ్‌మెంట్‌ పైనే నడుస్తోంది. పోలీస్‌ స్టేషన్లో పైరవీలు చేసేందుకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కాసులిస్తే కాస్ట్లీ పోలీస్‌ స్టేషన్‌!

తిరుపతిలోని ఓ ప్రజాప్రతినిధి పెద్ద మొత్తంలో కాసులు తీసుకొని ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు కొందరు పోలీస్‌ అధికారులను కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రజాప్రతినిధి పీఏ చేతికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. గతంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక పోలీస్‌ స్టేషన్లో పనిచేసిన సీఐ ఈ మొత్తం నగదును చెల్లించి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వస్తున్నట్టు చర్చ మొదలైంది. అదేవిధంగా తిరుపతి అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఇదే ప్రజాప్రతినిధి మరో అధికారికి విక్రయించినట్లు సమాచారం. వీరందరికీ త్వరలోనే డ్యూటీ ఆర్డర్‌ కూడా ఇస్తారని చర్చించుకుంటున్నాయి.

● తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూడా పలువు రు ఐపీఎస్‌ స్థాయి అధికారులు ఇద్దరు సీఐల పేర్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. గతంలో అన్నమయ్య జిల్లాలో పనిచేసిన ఓ ఎస్పీ అక్కడ స్పెషల్‌ బ్రాంచ్‌లో సీఐగా పనిచేసిన వ్యక్తిని తిరుమలకు తీసుకొ స్తానని మాటిచ్చినట్టు సమాచారం. అదే పోలీస్‌స్టేషన్‌కు మరో ఐపీఎస్‌ అధికారి ఇంకో సీఐకి పోస్టింగ్‌ ఇప్పిస్తానని మాటిచ్చినట్టు సమాచారం. ప్రస్తు తం ఇదే స్థానంలో పనిచేస్తున్న సీఐకి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారుల ఆశీస్సులు ఉండడం గమనార్హం.

గతంలో పనితీరును బట్టి పోస్టింగ్‌లు

గతంలో పనితీరుని బట్టి పోస్టింగ్‌ వచ్చేవారు. కేసుల పరిష్కార వైనం, రివార్డులు, అవార్డులు, చార్జీ మెమోలు, ఇలా అన్నిటినీ పరిశీలించేవారు. అయితే ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధి సిఫారసు, సామాజిక సమీకరణకే ప్రాధాన్యత ఇస్తూ బదిలీలు చేస్తున్నారు. అంతేకాకుండా కీలకమైన పోలీస్‌ స్టేషన్లు కోరేవారికి అది ఎంత మొత్తంలో నగదు చెల్లిస్తే అంత మంచి పోలీస్‌ స్టేషన్‌కు పోస్టింగ్‌ ఇచ్చే విధంగా ప్రస్తుత పాలన సాగుతుంది. ఆ తర్వాత ఆ డబ్బంతా ఫిర్యాదుదారుల వద్ద నుంచి వసూలు చేస్తారని బహిరంగ రహస్యం. ఇప్పటికే చాలా పోలీస్‌ స్టేషన్లలో చిన్నపాటి కేసు నమోదు చేయాలన్నా కూడా కాసులు చెల్లించాల్సి వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement