
10 నుంచి బ్రహ్మోత్సవాలు
తిరుపతి కల్చరల్: కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. 10న ఉదయం 10.10 నుంచి 10.30 గంటల మధ్య చేపట్టే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం చేపడతారు. 11న సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి గరుడ వాహన సేవ జరుగనుంది. 11, 12, 13 తేదీల్లో ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మ వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. 12, 13 తేదీల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఊంజల్ సేవ చేపడతారు. 14న ఉదయం 10.10 నుంచి 10.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.
చెరువును పూడిస్తే సహించం
తిరుపతి రూరల్ : మండలంలోని ఓటేరు పంచాయతీలో ఉన్న ఓటేరు చెరువును పూడిస్తే సహించే ప్రసక్తే లేదని స్థానికులు స్పష్టం చేశారు. ఆదివారం టిప్పర్లతో మట్టి తోలి చెరువును పూడ్చేందుకు యత్నించిన కబ్జాదారులను వారు అడ్డుకున్నారు. రూ.కోట్ల విలువైన చెరువు జోలికి వస్తే ఒప్పుకోమని తెగేసి చెప్పారు. దీంతో ఆక్రమణదారులు చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
చంద్రగిరి : మండలంలోని ఎం.కొత్తపల్లి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గ్రామస్తులు దాడి చేశారు. వివరాలు.. పాకాల నుంచి తిరుపతి వైపునకు ఆర్టీసీ బస్సు వస్తుండగా ముంగళిపట్టు హఠాత్తుగా రోడ్డుకు మధ్యకు ఓ ఆవు వచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా తప్పించేందుకు యత్నించినా బస్సు వెనుక భాగం ఆవుకు తగిలింది. ఈ ప్రమాదంలో ఆవు మృతి చెందింది. అయినప్పటికీ బస్సును నిలపకుండా డ్రైవరు వెళ్లిపోతుండగా గ్రామస్తులు వెంబడించారు. ఎం.కొత్తపల్లి వద్ద బస్సు ఆపి, డ్రైవరు మునిపై దాడి చేశారు. దీంతో డ్రైవరు ముని అపస్మారక స్థితికి చేరుకోగా 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఉత్సాహంగా ఇంటర్‌జోన్ స్పోర్ట్స్ మీట్
తిరుపతి కల్చరల్: న్యూబాలాజీ కాలనీలోని భాష్యం సీవో క్యాంపస్‌లో భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాలలో విద్యార్థులకు ఇంటర్‌జోన్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి నారాయణాద్రి హాస్పిటల్ ఎండీ డాక్టర్ సునందకుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగాల్లో రాణిస్తూ ప్రతిభావంతులుగా ఎదగాలని తెలిపారు. అనంతరం నిర్వహించిన ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్వీయూ కళాశాల కామర్స్, మేనేజ్‌మెంట్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ కె.జయచంద్రారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జ్ ఎల్.లక్ష్మణరావు, ప్రిన్సిపల్స్ శ్రీనివాసులు, నేతాజీ, బాలాజి, ఆంజనేయులు, బిందు మాధవి, హెచ్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.

10 నుంచి బ్రహ్మోత్సవాలు

10 నుంచి బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment