
పవిత్రం.. రంజాన్ మాసం
నాయుడుపేటటౌన్ : రంజాన్ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతున్నారు. వేకువజామున సహారీ చేసిన తర్వాత సాయంత్రం వరకు అన్నపానీయాలు స్వీకరించకుండా కఠిన నియమాలను పాటిస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ప్రత్యేకంగా ఆష్ (గంజి) పంపిణీ చేస్తున్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన వారికి ఇఫ్తార్ సమయంలో అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ముస్లింలు మసీదుకు వచ్చేప్పుడు ఇఫ్తార్ విందు కోసం ఖర్జూరాలు, అరటి పండ్లు, తదితర తినుబండారాలను తీసుకువస్తున్నారు. సామూహికంగా ఉపవాస దీక్షలున్నవారికి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా మసీదుల వద్ద అందించే ఆష్ కోసం పెద్దసంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. ఆష్‌ను ఇంటికి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సేవిస్తున్నారు. హిందువులు సైతం మసీదు వద్దకు వచ్చి ఆష్ స్వీకరించడం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కొంతమంది మసీదుల వద్ద ఆష్ తయారు చేసేందుకు విరాళాలు సైతం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కఠిన ఉపవాస దీక్ష పాటిస్తూ చిత్తశుద్ధితో అల్లాహ్‌ను ప్రార్థిస్తే చక్కటి జీవిత గమనం పొందవచ్చని మౌలానాలు ప్రభోదిస్తున్నారు. ఈ మాసంలో ముస్లింలు వారి శక్తి మేరకు దానధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు.
భక్తిశ్రద్ధలతో ముస్లింల ఉపవాస దీక్షలు
మసీదుల్లో నిత్యం ‘ఆష్’ పంపిణీ
200 ఏళ్లకు పైగా..
నాయుడుపేట పట్టణంలోని జామియా మసీదు (పెద్ద మసీదు)లో 200 ఏళ్లకు పైగా రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆష్ పంపిణీ జరుగుతోంది. వెంకటగిరి రాజాల పాలనలో అప్పటి సామంత రాజులుగా ఉన్న ఆర్కాట్ నవాబులు జామియా మసీదును నిర్మించారు. అప్పటి నుంచి ఈ మసీదులో ఉపవాస దీక్ష పాటిస్తున్న వారికి ఆష్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. – హాజీ రంతుల్లా సాహెబ్,
జామియా మసీదు ముతవల్లి
ఆరోగ్యానికి మంచిది
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలు ఉండేవారు ఆష్ సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచింది. ఉపవాస దీక్ష విరమణకు మొదటగా ఆష్‌ను తీసుకుంటే కోల్పోయిన శక్తిని పొందడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. తర్వాత ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇబ్బంది ఉండదు.
– పఠాన్ ఆరాఫత్ ఖాన్, నాయుడుపేట

పవిత్రం.. రంజాన్ మాసం

పవిత్రం.. రంజాన్ మాసం

పవిత్రం.. రంజాన్ మాసం
Comments
Please login to add a commentAdd a comment