
● చంద్రగిరిలో ఉద్యోగులు బరితెగించేశారా? ● డబ్బులు ఇచ్చ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలో పంచాయతీ అధికారి ఏసీబీకి పట్టుబడిన విషయం విధితమే. దీంతో అప్రమత్తమైన పోలీసు నిఘా వర్గాలు ఇక్కడి అవినీతి, అక్రమాలపై సీఎం కార్యాలయానికి నివేదిక అందజేసినట్టు సమాచారం. ప్రధానంగా తిరుపతి నగరానికి సమీపంలోని చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నట్టు తెలుస్తోంది. తిరుపతి రూరల్ మండలంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ , ఇనాం, మఠం భూములను టీడీపీ నేతలకు కట్టబెట్టారని నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. అక్రమార్కులతో కుమ్మకై ్క వాటాలు తీసుకుని నదులు, గుట్టలను తవ్వేస్తున్నా, ఇసుకను అమ్మేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు కూడా సీఎంఓకు చేరినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వచ్చే ప్రజల నుంచి ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి బహిరంగ వసూళ్లు చేయడంపై సీఎంఓ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ, జనసేన నేతలు తమ పార్టీల అధినేతల దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్టు తెలిసింది.
ఎన్నడూ లేని విధంగా..
చంద్రగిరి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. దీనికి కారణం ఉద్యోగుల బదిలీల్లో భారీ ముడుపులు అందించడమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక నేతల అక్రమాలపై టీడీపీని ఓ బలమైన వర్గం ఇతర కూటమి నేతలతో కలసి అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ప్రభుత్వానికి అనుకూల పత్రికల్లో వరుసగా వార్తలు వస్తున్నా.. వారిలో మార్పు రావడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌కు విన్నవించుకున్నట్టు తెలిసింది.
డబ్బులిచ్చి వచ్చారు.. జైలుకు వెళుతున్నారు..
చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్యోగం చేయడానికి స్థానిక నేతలకు డబ్బు ఇచ్చి వచ్చిన ఉద్యోగులపై ఏసీబీ కన్నువేయడంతో ఒక్కొక్కరుగా జైలుకు వెళతారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. బదిలీల సమయంలో డబ్బులు తీసుకున్న పెద్ద మనుషులు ‘‘మీ సంపాదనలో ఎక్కడ సమస్య రాదు.. అన్నీ మేం చూసుకుంటాం’’.. అని భరోసా ఇచ్చినప్పటికీ ఏసీబీ దాడులతో ఉద్యోగుల్లో భయం పట్టుకున్నట్టు సమాచారం. ముడుపులు చెల్లించి పోస్టుల్లోకి వచ్చిన అధికారులు ఆ డబ్బు సంపాదించుకోవడానికి విచ్చలవిడిగా అవినీతికి తెర లేపారన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా సొమ్ము ముట్టుజెప్పాల్సి వస్తోందనే ఆరోపణలు సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇలా బరితెగించి డబ్బులు వసూలు చేస్తుండడంతో కనిపించిన ప్రతి టీడీపీ నాయకుడిని ప్రజలు బహిరంగంగానే తిడుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment