
రెచ్చిపోతున్న కూటమి నేతలు
● స్వర్ణముఖిలో యథేచ్ఛగా సై‘ఖతం’ ● యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వకం ● నదీమతల్లికి తప్పని గర్భశోకం ● రాత్రింబవళ్లు అక్రమంగా ఇసుక తరలింపు ● పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు
రేణిగుంట/శ్రీకాళహస్తి రూరల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి నదిని ప్రదాన ఆదాయ వనరుగా కూటమి నేతలు మార్చేసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తవ్వేస్తున్నారు. యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. స్వర్ణముఖిలోకి నిత్యం జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో పచ్చ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. నదిలో జేసీబీల సాయంతో ఇష్టారాజ్యంగా రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. నదీతీరంలో గ్రామాల్లో తిష్ట వేసి ఇసుక అక్రమ రవాణాను పర్యవేక్షిస్తున్నారు.
కన్నెత్తి చూడని అధికారులు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే గతంలో ఇసుకాసురుల ధనదాహానికి ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనలు రాష్ట్రస్థాయిలో సంచలనం రేపిన విషయం విధితమే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుకాసురులు ముఠాగా మారి స్వర్ణముఖిలో సహజ వనరులను తోడేస్తున్నా, అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పోలీసులు మాత్రం అప్పుడప్పుడూ మొక్కుబడిగా ట్రాక్టర్లను స్వాధీనం చేసకుని చిన్నపాటి కేసులు పెట్టి వదిలేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల మాత్రం టీడీపీ ముఖ్య నేతకు విధేయంగా నడుచుకుంటున్నారు. ఆయన అనుచరులకు వంత పాడుతూ మాకేం కనపడలేదు.. మాకేం వినపడలేదు.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఇసుకాసురులకు అందించేస్తున్నారు. దీంతో సామాన్యులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వణికిపోతున్నారు.
ఈ ప్రాంతాలే అడ్డా!
రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, తూకివాకం, జీపాళెం, పిల్లపాళెం సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి నిత్యం ఇసుక తవ్వేసున్నారు. ఒక్కో చోటు నుంచి ప్రతి రోజూ సగటను 50 నుంచి 70 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు.
జీపాళెం సమీపంలో మూడు నెలలుగా టీడీపీ ముఖ్య నేత అనుచరుడినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఇసుకను రాత్రింబవళ్లు తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఆయనకు రూ.1,400 కప్పం కట్టాల్సి ఉంటుంది. సదరు ముఖ్యనేత అనుచరుడికి ముడుపు చెల్లిస్తే ఇక ట్రాక్టర్‌ను ఎవరూ ఆపరు. దీంతో రోజుకు 100 ట్రాక్టర్లకు పైగా ఇక్కడ నుంచి పగటి పూట తరలిస్తున్నారు. అదే రాత్రి వేళల్లో జేసీబీలు పెట్టి లారీలలో లోడ్ చేసి చైన్నె, బెంగళూరుకు అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.
కొట్రమంగళం నుంచి ఎక్కువగా తిరుపతికి, చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక తరలిస్తున్నారు. నది వెంబడి ఉండే పంట పొలాలలో ఎలాంటి అనుమతులు లేకుండా 30 నుంచి 40 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వేసి అమ్మేస్తున్నారు.
ఏర్పేడు మండలం పాపానాయుడుపేట, పెనుమల్లం, మునగలపాళెం, ఎండీ పుత్తూరు, కొత్తవీరాపురం గ్రామాల పరిధిలోని స్వర్ణముఖీ నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.
శ్రీకాళహస్తి మండలం రామాపురం, రామలింగాపురం, వేడాం, చుక్కలనిడిగల్లు గ్రామాల నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలిపోతోంది. తొట్టంబేడు మండలం విరూపాక్షపురం, బసవయ్యపాళెం, కన్నలి, చోడవరం, కాసరంలో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు.

రెచ్చిపోతున్న కూటమి నేతలు

రెచ్చిపోతున్న కూటమి నేతలు

రెచ్చిపోతున్న కూటమి నేతలు

రెచ్చిపోతున్న కూటమి నేతలు
Comments
Please login to add a commentAdd a comment