ధాన్యానికి ధరల్లేవు
● ప్రభుత్వ సాయమూ లేదు ● గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలన్నా అద్దె చెల్లించాల్సిందే ● అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు ● పట్టించుకోని అధికారులు, నేతలు
సూళ్లూరుపేట: జిల్లాలో రబీ సీజన్ ముగింపు దశకు చేరింది. వరి ఒబ్బిళ్లు జోరందకున్నాయి. కానీ ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాల్లోనే రైతులు తెగనమ్మేస్తున్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేవరకు ఏఎంసీ గోదాముల్లో నిల్వ చేసుకుందామంటే బస్తాకు రూ.3 చొప్పున అద్దె చెల్లించాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో చేసేది లేక రైతులు ఒకటికి సగానికి విక్రయిస్తున్నారు.
గతంలో రుణాలు..ఇప్పుడు ఒట్టి చేతులు
గతంలో ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకుంటే రుణాలిచ్చేవారు. ఒక లాట్‌కి 150 బస్తాలు ధాన్యా న్ని నిల్వ చేసుకుంటే ధాన్యం మద్దతు ధరపై 75 శాతం రుణం కింద ఇచ్చేవారు. దీనికి మూడు నెలలు దాకా బాడుగ కట్టనవసరం లేదు. ఆ తరువాత నెలకు బస్తాకి ఒక్క రూపాయి లెక్కన అద్దె చెల్లించాల్సి ఉండేది. తీసుకున్న రుణానికి కూడా చాలా తక్కువ వడ్డీ ఉండేది. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. బస్తాకు రూ.3 లెక్కన అద్దె చెల్లించాల్సి వస్తోంది.
అన్నీ కష్టాలే
గతంలో ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ ఉంచుకుంటే రుణాలు ఇచ్చేవారు. ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేవారు. సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, పరికరాలు అందజేసేవారు. కానీ ఇప్పుడు ఇవేవీ లేకుండా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. మిల్లర్లను రైతులపైకి వదిలి చోద్యం చూస్తున్నారు.
నిల్వ చేసేదెక్కడ?
తిరుపతి జిల్లా పరిధిలోని 34 మండలాలకుగాను 774 పంచాయతీల్లో 16 మార్కెటింగ్ కమిటీలున్నాయి. వీటి పరిధిలో 34,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు 37 గోదాములున్నాయి. అయితే ఈ ఏడాది జిల్లాలో 2.07 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఎకరానికి సరాసరిన 30 బస్తాల దిగుబడి వచ్చినా 5 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇందులో ఇప్పటిదాకా 60 శాతం ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. మిగిలిన 40 శాతం ధాన్యాన్ని విక్రయించారు. ఈ నెలాఖరు దాకా కోతకు వచ్చే పంటలు కూడా ఉండడంతో మరికొంతమంది నిల్వ చేసుకునే అవకాశం ఉంది.
రుణాలిచ్చే పరిిస్థితి లేదు
ప్రస్తుతం ఏఎంసీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకునే రైతులకు రుణాలివ్వలేని పరిస్థితి ఉంది. రైతులే బస్తాకు మూడు రూపాయలు అద్దె చెల్లించి నిల్వ చేసుకోవాలి. గతంలో ఒక రైతుకు ఒక లాట్ మాత్రమే కేటాయించే వారం. ఇప్పుడు పట్టాదారు పాసుపుస్తకాలను బట్టి ధాన్యం నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాము. – వ్యవసాయ మార్కెటింగ్
కమిటీ కార్యదర్శి, సూళ్లూరుపేట
గతంలో రుణాలిచ్చేవారు
వ్యవసాయ మార్కెట్ కమి టీ గోదాములో ధ్యానం నిల్వ చేసుకుంటే గతంలో 75 శాతం రుణం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రైతుల బతుకు మాత్రం మారడం లేదు. చాలా బాధాకరం.
– వాకాటి బాబురెడ్డి, గోపాల్‌రెడ్డిపాళెం
ధాన్యానికి ధరల్లేవు
ధాన్యానికి ధరల్లేవు
Comments
Please login to add a commentAdd a comment