గిరిజన కార్పొరేషనా.. మజాకా
● రుయాలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ● జనసేన నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ● లబోదిబోమంటున్న సమీప దుకాణదారులు
తిరుపతి తుడా: తిరుపతి రుయాలో గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్‌కి చెందిన ఉత్పత్తుల విక్రయాలకు అనుమతిచ్చారు. ఇప్పుడు ఈ దుకాణం రావడంతో రుయాలో టెండర్లు ద్వారా దక్కించుకున్న దుకాణదారులకు కంట్లో నలుసు పడ్డట్టయ్యింది. పక్కన ఉన్న ఐదు అడుగుల బంక్ నిర్వాహకుడు రుయాకు నెలకు రూ.1.3 లక్షలు అద్దె చెల్లిస్తుండగా గిరిజన కార్పొరేషన్ పేరుతో ఇతర ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యక్తి కేవలం రూ.20 వేల లోపేలోపు అద్దె చెల్లిస్తున్నారు. ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు గిరిజన కార్పొరేషన్ దుకాణాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఏకంగా హోటల్‌నే పెట్టేశారు
గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్ దుకాణంలో గిరిజన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలి. అయితే రుయాలో ఏర్పాటైన ఈ దుకాణంలో జంక్ ఫుడ్స్‌తో పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ఇతర అల్పాహారాలు, రాత్రి పూట టిఫిన్ విక్రయిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ వంటివి విక్రయిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గిరిజన కార్పొరేషన్ దుకాణానికి నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చాం. ఆ మేరకు విక్రయాలు జరపాలి. ఈ దుకాణాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి నోటీసులు జారీచేస్తాం. అప్పటికీ స్పందించకుంటే తగిన చర్యలు తీసుకుంటాం. దుకాణంలో ఎమ్మార్పీకే విక్రయాలు జరపాలి. లేని పక్షంలో దుకాణాన్ని సీజ్ చేస్తాం.
– డాక్టర్ రవిప్రభ, రుయా సూపరింటెండెంట్
నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు
రుయా ఆస్పత్రిలో గిరిజన కో ఆపరేటివ్ దుకాణం అనుమతులు మొదలు స్థలం కేటాయింపు, అద్దె ఖరారు, ఆపై విక్రయాల వరకు అంతా వివాదంగా మారింది. జనసేన నేతల ఒత్తిడికి అధికారులు లొంగిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థలం మార్చే క్రమంలో జనసేన నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి నెలకు రూ.20 వేల లోపే అద్దెను నిర్ణయించారు. గిరిజన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాల్సి ఉండగా ఇతర ఉత్పత్తులతో పాటు ఏకంగా హోటల్ నిర్వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment