● రాజీకి రావాలని.. నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నా ● న్యాయం జరిగేవరకు కిరణ్‌రాయల్‌పై పోరాడుతూనే ఉంటా ● తిరుపతి ప్రెస్ క్లబ్‌లో జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘కాంప్రమైజ్ రావాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. విజయవాడ వచ్చి కలవాలని చెబుతున్నారు. కానీ నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లకూడదని అనుకుంటున్నాను’ అని తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి వెల్లడించారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని కిరణ్ రాయల్ తనను నమ్మించి ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని మోసం చేశారంటూ తిరుపతికి చెందిన లక్ష్మి పలుమార్లు మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన వద్ద తీసుకున్న నగదు, బంగారు నగలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె తన విషయం పది మందికి తెలిసేలా చేసిందనే కోపంతో జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్‌చేసి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురిచేసిన విషయాలను ఆడియో రూపంలో బయటపెట్టారు. ఆ తరువాత కిరణ్ రాయల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్‌కు సన్నిహితంగా మెలిగే ఓ సీఐ రంగంలోకి దిగి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా లక్ష్మి మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించింది.
రాజకీయంగా.. ఆటబొమ్మలా వాడుకున్నారు
తనకు న్యాయం చేస్తానని కిరణ్ రాయల్ ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పిస్తానంటూ తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడు ఏడాది కిత్రం తన వద్దకు వచ్చి వీడియోలు, ఆడియోలు తీసుకున్నాడని లక్ష్మి బయటపెట్టారు. ఆ తర్వాత అవన్నీ సోషల్ మీడియాలో ఎలా ప్రత్యక్షమయ్యాయో తనకు తెలియదన్నారు. తనను రాజకీయంగా ఆటబొమ్మలా వాడుకున్నారని ఆమె వాపోయారు. ప్రస్తుతం ఎస్వీయూ పోలీసు అధికారులు తన సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంతటితో సమస్యకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో, తన కుమారుల సూచనల మేరకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా తనను రాజకీయంగా వాడుకోవద్దని జనసేన నేతలను వేడుకున్నారు. తన వెనుకాల ఏ రాజకీయ పార్టీ లేదని, అయితే జనసేన వాళ్ల మధ్య ఏముందో తనకు తెలియదన్నారు. తన వద్ద నుంచి జనసేన జిల్లా అధ్యక్షుడు ఆడియో, వీడియోలు తీసుకున్న వివరాల్ని పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించారు. తన వెనుక వైఎస్సార్‌సీపీ నేతలున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. లక్ష్మికి కిరణ్ రాయల్ ఇవ్వాల్సిన డబ్బును తిరిగి ఇస్తానని కుమారులకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment