అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
తిరుపతి కల్చరల్: అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్నా స్పందించకపోవడం దుర్మార్గమని ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ల్ర గౌరవాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ ధ్వజమెత్తారు. ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో మంగళవారం యూనియన్ జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి వారి ఓట్లతో కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకుందన్నారు. ఇప్పటి వరకు అంగన్‌వాడీలతో చర్చలు జరపకపోవడం విడ్డూరమన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రాష్ట్రంలోని మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్లకు, మినీ వర్కర్లకు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలన్నారు. అన్ని డిమాండ్ల సాధన కోసం ఈనెల 10న విజయవాడలో చేపట్టే మహా ధర్నాకు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.భారతి, ఐఎఫ్‌టీయూ నేతలు పి.వెంకటరత్నం, జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment