
గందరగోళం.. దా‘రుణం’!
చంద్రగిరి: రాష్ట్ర ప్రభుత్వం కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బీసీ, బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు అందిస్తున్న రుణాల ఇంటర్వ్యూల్లో గందరగోళం నెలకొంది. శుక్రవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు అధికారులు, బ్యాంకర్లు సంయుక్తంగా ఇంటర్వ్యూలను నిర్వహించారు. మండలంలోని ఏడు బ్యాంకులకు 68 యూనిట్లను టార్గెట్‌గా ప్రభుత్వం కేటాయించింది. రుణాల కోసం వచ్చిన లబ్ధిదారులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయలేదు. ఇదిలావుండగా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చంద్రగిరి ఎస్‌బీఐ, ఎస్‌బీఐ(ఏడీబీ), బీఓఐ బ్యాంకుల అధికారులు హాజరు కాలేదు. 562 మంది దరఖాస్తుదారులకు గాను 450 మంది హాజరు కాగా, 112 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నానానికి ఇంటర్వ్యూలను మమ అనిపించారు.
వెనక్కి ఇచ్చేసిన బ్యాంకర్లు
రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కొంత మంది లబ్ధిదారుల దరఖాస్తు ఫారాలను తిరిగి ఇచ్చేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ దరఖాస్తులు తమ బ్యాంకుకు సంబంధం లేదంటూ సంబంధిత అధికారులు తేల్చిచెప్పారు. దీంతో చేసేది లేక లబ్ధిదారులు నిట్టూర్పులు వెళ్లగక్కుతూ ఇళ్లకు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment