
రేపు ఐటీఐలో అప్రెంటిస్‌షిప్ మేళా
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. ఆ మేరకు ప్రిన్సిపాల్, కన్వీనర్ వి.శ్రీలక్ష్మీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వున్న గుర్తింపు పొందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అలాగే ఆయా కంపెనీల్లో అప్రెంటీస్ ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు అప్రెంటీస్‌షిప్ సలహాదారు సి.గంగాధరంను 94416 47174, 95337 17170 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
లక్ష్య సాధనకు
నిబద్ధతతో పనిచేయాలి
తిరుపతి సిటీ: మహిళలు ఉన్నత లక్ష్యసాధనకు నిబద్ధతతో అడుగు ముందుకు వేయాలని, అప్పుడే విజయం సొంతమవుతుందని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ పేర్కొన్నారు. పద్మావతి మహిళా వర్సిటీ, మహిళా అధ్యయన కేంద్రం సంయుక్తంగా వే ఫౌండేషన్ సహకారంతో శనివారం సావేరి సెమినార్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా దినోత్సవం 2025 థీమ్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్‌ల్స్ రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్‌మెంట్ అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. స్విమ్స్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ వి.వనజాక్షమ్మ మహిళల ఆరోగ్య సంరక్షణపై వివరించారు. కార్యక్రమంలో డీన్ కొలకలూరి మధుజ్యోతి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సుధారెడ్డి, మాజీ వైస్ వీసీ ప్రొఫెసర్ దుర్గా భవాని, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ గీతావాణి, వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య, మహిళా అధ్యయన శాఖ ఇన్‌చార్జి డాక్టర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
10 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,127 మంది స్వామివారిని దర్శించుకోగా 22, 910 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.47 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment