
గరుడ వాహనంపై కోదండరాముడు
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అడుగడుగునా భక్తులకు హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం మోహినీ అవతారధారుడైన శ్రీరామచంద్రమూర్తి పల్లకీలో కొలువై పురవీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. తర్వాత గరుడ పాదుకలను ఊరేగించా రు. పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఆలయ డెప్యూ ఈవో నాగరత్న, ఏఈవో రవి, సూపరింటెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
సోమవారం రాత్రి నిర్వహించిన గరుడ సేవలో వివిధ ప్రాంతాలకు చెందిన కళాబృందాలు ప్రదర్శించిన కళాప్రదర్శనలు భక్తులకు ఆకట్టుకున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కళాకారులు పాల్గొని తమదైన శైలిలో సంగీత, నృత్య ప్రదర్శనలతో అబ్బుర పరిచారు. బెంగళూరుకు చెందిన శ్రీపద్మావతి చెక్క భజన, కోలాటం, విశాఖపట్నంకు చెందిన భవదేయ ట్రస్ట్ సుగుణకుమారి ‘దింసా’ నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. అలాగే చంద్రగిరికి చెందిన 15 మంది చెక్క భజనతో మహిళా కళాకారులు, శ్రీగౌరీ శంకర కోలాట భజన అలరింపజేసింది.