
చెరువుల సుందరీకరణే లక్ష్యం
తిరుపతి అర్బన్ : జిల్లాలోని చెరువుల రక్షణతోపాటు సుందరీకరణే లక్ష్యంగా పనులు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సప్లయ్ చానళ్లను పునరుద్ధరించాలని సూచించారు. పట్టణ, నగర ప్రజలు సరదా కొంత సమయం గడపేందుకు వీలుగా చెరువు గట్లను తీర్చిదిద్దాలని కోరారు.రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి,శ్రీకాళహస్తి ఆర్‌డీఓలు రామమోహన్, భానుప్రకాష్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు వెంకటేశ్వరప్రసాద్,శారద, మత్స్యశాఖ జిల్లా అధికారి నాగరాజు, సర్వే విభాగం జిల్లా అధికారి అరుణ్‌కుమార్, తిరుపతి కార్పొరేషన్ ఎస్‌ఈ శ్యామ్‌సుందర్, తుడా ఎస్‌ఈ కృష్ణారెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, రూరల్ తహసీల్దార్ రామాంజనేయులు పాల్గొన్నారు.
రంగంపేట హైస్కూల్ అభివృద్ధికి చర్యలు
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చంద్రగిరి మండలంలోని రంగంపేట హైస్కూల్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్‌డీఓ రామమోహన్, డీపీఓ సుశీలాదేవి, డీఈఓ కేవీఎన్ కుమార్, శ్రీసిటి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే విద్యాసంవత్సరానికి రంగంపేట హైస్కూల్‌ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సుధాకర్‌రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథ, చంద్రగిరి తహసీల్దార్ శివరామ్ పాల్గొన్నారు.