
ధాన్యం సేకరణపై అవగాహన
ఏర్పేడు(రేణిగుంట):ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరులో ధాన్యం సేకరణపై రైతులకు బుధవా రం అవగాహన కల్పించారు. సివిల్ సప్లయ్ డీఎం పద్మావతి మాట్లాడుతూ ధాన్యంలో తేమ శాతం 17 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి రైతు సేవా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. పీఏసీఎస్‌లో రైస్‌మిల్ అసైన్ చేయించుకుని ధాన్యం అప్పగించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,740 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాకు నగదు జమ చేస్తామని వెల్లడించారు. దీనిపై సర్పంచ్ కందాటి మోహనప్రియ మాట్లాడుతూ గత ఏడాది బస్తాకు రూ.2,300 వరకు చెల్లించారని, ఇప్పుడు ఇస్తున్న రేటులో రైతులు నష్టపోతారని తెలిపారు. ఈ క్రమంలో ధర పెంచి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ షణ్ముగం, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ టి.భారతి పాల్గొన్నారు.
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి తిరుచానూరు జెడ్పీ హైస్కూల్‌లో జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం) ప్రక్రియ ప్రారంభమవుతుందని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 1.85లక్షల జవాబు పత్రాలను మూల్యాంకన నిమిత్తం కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీకి ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం తుది సవరణలు, డేటా ఎంట్రీ, వెరిఫికేషన్ ఉంటాయని వివరించారు. ఈ నెల 20– 25వ తేదీల మధ్య ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్లు తెలిపారు. మూల్యాంకన పర్యవేక్షణకు ఇద్దరు చీఫ్ కోడింగ్ ఆఫీసర్లు, 130మంది చీఫ్ ఎగ్జామినర్లు, 775మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 260మంది స్పెషల్ అసిస్టెంట్లు, 10మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు.ఒక్కో ఎగ్జామినర్ రోజుకు 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు వెల్లడించారు.