
టీటీడీ చైర్మన్‌గా భూమన సేవలు అద్వితీయం
● ఏ తప్పూ చేయలేదని ప్రమాణం చేసిన దమ్మున్న నాయకుడు ● భూమనను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే నానికి లేదు : మోహిత్‌రెడ్డి
తిరుపతి రూరల్: హైందవ ధర్మ పరిరక్షణకు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి చేసిన సేవలు అద్వితీయమని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి కొనియాడారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతిలోని ఎస్వీ గోశాలను సందర్శించినప్పుడు భూమనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హైందవ సంస్కృతి, సనాతన ధర్మం గురించి కరుణాకరరెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. సనాత ధర్మంపై ఎంతో గొప్ప పరిజ్ఞానం కలిగిన ఆయనను, నిత్యం అబద్ధాలతో పబ్బం గడుపుకునే ఎమ్మెల్యే నాని విమర్శిస్తే ప్రజలు నవ్వుతారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తొలిసారిగా టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమన సనాతన ధర్మ రక్షణకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. అందులో ప్రధానంగా దళిత గోవిందం, మత్స్యగోవిందం, కల్యాణమస్తు, గోవింద కోటి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల ముందుకు తెచ్చారని వివరించారు. స్వామి చెంతకు రాలేని వారందరికోసం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడినే దళితవాడలకు తీసుకువెళ్లి పూజలు చేయించిన గొప్ప మనిషి భూమన అని తెలిపారు. మత్స్యకారులకు వైదిక కర్మల్లో శిక్షణ ఇప్పించి, సర్వమానవ సమానత్వాన్ని చాటారన్నారు. కల్యాణమస్తు ద్వారా బంగారపు తాళిబొట్టు, వెండి మట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్లి సామగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్లి భోజనాలు ఉచితంగా కల్పించారని వివరించారు. గోవింద కోటి ద్వారా భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించి ప్రజల్లో భక్తి తత్వాన్ని పెంపొందించారని వెల్లడించారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని చూడలేని ఎంతో మంది సామాన్య భక్తులకు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, దైనందిన పూజలు, టీటీడీ నిర్వహించే ధార్మిక కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఎస్వీబీసీ చానల్ ప్రారంభించిన ఘనత భూమనకే దక్కుతుందని వెల్లడించారు. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం కలిగిస్తూ నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ‘‘ఓం నమో వేంకటేశాయ’’ అన్న మంత్రాన్ని వినిపించేలా చేశారన్నారు. తిరుమల శ్రీవారి దర్శనంలో తిరుపతి వాసులకు ప్రాధాన్యత కల్పించేలా స్థానికులకు ప్రత్యేకంగా వారంలో ఒక రోజు దర్శనం చేసుకునే అదృష్టం కల్పించారని వివరించారు. శ్రీవారి సేవలో నిత్యం తలమునకలైన టీటీడీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన శక్తి, సామర్థ్యం భూమన కరుణాకరరెడ్డికి మాత్రమే సొంతమని తెలిపారు. ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్‌గా తిరుమల ఆలయ ప్రతిష్టను పెంచేలా గొప్ప సంస్కరణలను తీసుకువచ్చారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రపూరితంగా నింద వేయడంతో ఆయన తిరుమలకు వెళ్లి సాక్షాత్తు ఆ దేవ దేవుని ముందు తడిబట్టలతో నిలబడి తాను తప్పు చేయలేదని ప్రమాణం చేసిన దమ్మున్న నాయకుడని స్పష్టం చేశారు. అలాంటి తమ నాయకుడి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే నానికి లేదని తెలిపారు.