
గుర్తుతెలియని వాహనం ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు
చంద్రగిరి : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. సుమారు 25 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని యువకుడు శుక్రవారం రాత్రి తన ద్విచక్ర వాహనంలో భాకరాపేట నుంచి తిరుపతికి వెళ్తుండగా పెద్ద మలుపు వద్ద గుర్తు తెలియని కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వస్తున్న తోటి ప్రయాణికులు గుర్తించి 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ క్షతగాత్రుడిని తిరుపతి రుయాకు తరలించారు. అయితే యువకుడు భాకరాపేట పరిసర ప్రాంతానికి చెందినట్లుగా తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.