
ఉద్యోగ భద్రత కల్పించండి
● మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఆందోళన బాట ● డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట నిరసన ● అనంతరం భారీ ర్యాలీ
తిరుపతి తుడా: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సంయుక్తంగా ఆందోళన బాట చేపట్టారు. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద మంగళవారం నిరసన మిన్నంటించారు. అనంతరం టౌన్‌క్లబ్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని గళం విప్పారు.
ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలి
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సుమంత్ మాట్లాడుతూ గ్రామీణులకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఎమ్‌ఎల్ హెచ్‌పీలను నియమించారన్నారు. వారికి వెంటనే ఈపీఎఫ్‌ఓను పునరుద్ధరించాలని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. మొత్తం ఎనిమిది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు చెప్పారు. ఈ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.