
‘ఉపాధి’లో అవినీతిపై విచారణ
సైదాపురం : ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ, ఇష్టారాజ్యంగా జాబ్‌కార్డులు అందించి నిధులు కాజేస్తున్నారంటూ సైదాపురం మండలం రాగనరామాపురం సర్పంచ్ ఉసా నరసమ్మ ఆరోపించారు. ఒక్కో ఇంట్లో మూడు, నాలుగు జాబ్‌కార్డులు ఉన్నాయని, పనులకు రానివారి పేర్ల మీద మస్టర్ రాసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారి డి.విజయలక్ష్మి, ఏపీడీ గాయత్రీదేవి, ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రాగనరామాపురంలో విచారణ చేపట్టారు. ఉపాధిలో భారీగా అక్రమాలు బహిర్గతమైనట్లు తెలిసింది. దీనిపై నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీఓ సురేంద్ర, కార్యదర్శి మాధవీలత పాల్గొన్నారు.
రేపటి నుంచి
పీజీ కళాశాలలకు సెలవులు
తిరుపతి సిటీ : ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ పీజీ కళాశాలలకు గురువారం నుంచి జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ మంగళవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 16వ తేదీన కళాశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.