
2027–28లో చంద్రయాన్–4 ప్రణాళిక
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2027–28 ఆర్థిక సంవత్సరంలో చంద్రయాన్–4 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రణాళికగా పెట్టుకున్నట్టు ఇస్రో శాసీ్త్రయ కార్యదర్శి ఎం.గణేష్ పిళ్‌లై వెల్లడించారు. చంద్ర నమూనా శాస్త్రం సంభావ్య అంశాలపై గురువారం ఒక జాతీయ సమావేశాన్ని అహమ్మదాబాద్‌లో ఫిజిక్స్ లేబోరేటరీ కార్యాలయంలో నిర్వహించినట్టు ఇస్రో తన వెబ్‌సైట్ ద్వారా తెలియజేసింది. ఈ సమావేశంలో ఉల్క నమూనాలు, భూసంబంధమైన అన్‌లాగ్‌లు, చంద్రుడి నేల అనుకరణలను విశ్లేషించారు. చంద్రుడి ఉపరితలంపై రిమోట్ సెన్సింగ్ పరిశీలనలను పరిమితం చేయడానికి ఆసక్తి ఉన్న శాస్త్రవేత్తలు సుమారు 50 మంది దాకా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో దాదాపు 50 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రయివేట్ విద్యాసంస్థలతో సహా 12 పరిశోధన విద్యాసంస్థలు వారు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా గణేష్ పిళ్‌లై మాట్లాడుతూ భారతదేశ చంద్రుడి అన్వేషణ కార్యక్రమానికి సంబంఽధించిన రోడ్ మ్యాప్‌ను రూపొందించామని తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై వ్యోమగాములను పంపించి తిరిగి క్షేమంగా తీసుకొచ్చేందుకు తలపెట్టబోయే ఈ ప్రయోగానికి ఈ జాతీయ సమావేశం ఎంతో దోహదపడుతుందన్నారు. చంద్రయాన్–4 ప్రయోగానికి సంబంధించి చంద్ర నమూనా క్యూరేషన్, విశ్లేషణల సౌకర్యాల ప్రణాళికలపై ఇస్రోలోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రం (యూఆర్‌ఎస్‌సీ) బృందాలతో చర్చలు జరిగినట్టు తెలిపారు.