
భార్య మృతి కేసులో ముగ్గురి అరెస్ట్
బుచ్చినాయుడుకండ్రిగ: వేధింపుల కారణంగా మృతిచెందిన భార్య కేసులో శుక్రవారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ వివ్వనాథనాయుడు తెలిపారు. వివరాలు.. మండలంలోని అరిగిలకండ్రిగ గ్రామంలోని ఆరుంధతివాడకు చెందిన పల్లవి (19) తొట్టంబేడు మండలం, దిగువ సాంబయ్యపాళెం గ్రామంలోని ఆరుంధతివాడకు చెందిన మాతయ్య ఆలియాస్ చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్‌లైన కొద్ది రోజులకే అనుమానంతో భర్త చరణ్, మామ కృష్ణయ్య, అత్త నాగరాజమ్మ, ఆడపడుచు గౌరీ, కుమార్ వేధించారు. ఈ వేధింపులు తాళలేక మనస్తాపంతో గత మార్చి 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్‌ఐ విశ్వనాథనాయుడు పల్లవి భర్త చరణ్, మామ కృష్ణయ్య, అత్త నాగరాజమ్మను శుక్రవారం చల్లమాంబపురం బస్టాండ్ వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆడపడుచు గౌరీ, ఆమె భర్త కుమార్ కోసం గాలిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
యువకుడిపై పోక్సో కేసు
దొరవారిసత్రం: మైనర్ బాలిక పట్ల అందలమాల శివ అనే యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానిక పోలీసులు పోక్సో యాక్ట్ కింద గురువారం రాత్రి కేసు నమోదు చేయగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం.. మండలంలోని కట్టువాపల్లి గ్రామానికి చెందిన శివ నెల్లూరు నుంచి కట్టువాపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చిన మైనర్ బాలిక పట్ల మూడు రోజుల కిందట అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలిక సమీప బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ అజయ్‌కుమార్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
లింగనిర్ధారణ
చట్టరీత్యా నేరం
తిరుపతి అర్బన్: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌తో కలసి వైద్యాధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు అనుమానిస్తున్న స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లపై డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిలా నోడల్ ఆఫీసర్ శాంతికుమారి పాల్గొన్నారు.