సాక్షి, న్యూఢిల్లీ: సినీ కార్మికుల కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కథానాయకులు రూ.కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారని, కార్మి కుల వేతనాలు మాత్రం అంతంతగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2023పై ఆయన మాట్లాడారు.
భారతీయ చలనచిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మి కులు పనిచేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయంలో మూడోవంతు పైగా భాగం కథానాయకుల పారితోషికాలకే సరిపోగా.. మిగిలిన మొత్తంతో చిత్రనిర్మాణం పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. సెన్సార్ బోర్డ్ సరి్టఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని కోరారు.
రైల్వే అప్రెంటీస్‌లకు న్యాయం చేయండి
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ) చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు రైల్వే నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్‌సీవీటీ పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్‌లో పెట్టిందన్నారు. మానవతా దృక్పథంతో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పైరసీ సైట్ల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి:ఎంపీ నిరంజన్‌రెడ్డి
విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ సైట్ల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారతీయ సినిమా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. పైరసీ సైట్లు సుమారు రూ.20 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఆయా సైట్లను బ్లాక్‌చేయడం ద్వారా భారతీయ సినిమాను రక్షించొచ్చన్నారు
Comments
Please login to add a commentAdd a comment