వికారాబాద్: మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ కమలంను వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన శనివారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. కాంగ్రెస్ పెద్దల నుంచి సీటు కేటాయింపుపై స్పష్టమైన హామీ లభించిన తర్వాతే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చురుగ్గా పని చేసిన ఆయన కొంతకాలంగా స్థబ్దుగా ఉంటున్నారు.
పార్టీ కార్యకలాపాల్లోగానీ.. కేడర్ బలోపేతం చేయడంగానీ కనిపించలేదు. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ సభకు సైతం ఆయన గైర్హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు, బీఆర్‌ఎస్ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడం, ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ఆయన సొంతపార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతూ వచ్చారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
ఐదు పార్టీలు.. ఐదుసార్లు విజయం..
ఇప్పటి వరకు ఐదు పార్టీలు మారిన మాజీ మంత్రి ఏసీఆర్ టీడీపీ, బీఆర్‌ఎస్ మినహాయిస్తే ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై న ఆయన్ను మూడు సార్లు మంత్రి పదవి వరించింది. 2009 ఉప ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ చేతిలో ఓటమి పాలైన ఆయన అనంతరం ఏ ఎన్నికల్లోనూ గెలువలేకపోయారు.
18న కాంగ్రెస్ తీర్థం..
మాజీ అమాత్యుడు ఎ.చంద్రశేఖర్ ఈ నెల 18న జహీరాబాద్‌లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పార్టీ కుండువా కప్పుకోను న్నట్లు తెలుస్తోంది. తన తండ్రి స్వగ్రామం జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం సైతం స్పష్టమైన హామీ ఇచ్చినందునే ఆయన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం.. రాష్ట్రంలో బీజేపీ ఒడిదొడుకులు.. కాంగ్రెస్‌తో ఆయనకున్న సత్సంబంధాల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
అయోమయంలో కేడర్..
ఏసీఆర్ బీజేపీకి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్‌లో చేరడం ఖరారు కావడంతో ఆయన అనుచరులు అయోమయానికి గురవుతున్నారు. తరచూ పార్టీలు మారుతుండటం.. ఏ పార్టీలోనూ ఎక్కువ రోజులు నిలకడగా ఉండకపోవటంతో ఆయన వెంట వెళ్లాలా వద్దా..? అనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బలమైన నాయకుడు మరో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఉండటంతో ఏసీఆర్ కాంగ్రెస్‌లో చేరినా మరో నియోజకవర్గానికి వెళ్లాల్సిందే.
జహీరాబాద్ లేదా చేవెళ్ల రెండింటిలో ఏదో స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆయన వికారాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం లేనందున మరో పార్టీ చూసుకుందామనే ఆలోచనలో అనుచరులున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయన పార్టీ మారిన ప్రతీసారి ఆయనతో వెళ్లడం.. అక్కడ ఆయన నిలదొక్కుకోకపోవడం.. నియోజకవర్గంలో సమయం ఇవ్వకపోవడంతో కేడర్ అసంతృప్తికి గురవుతున్నారు.
పీసీసీ చీఫ్‌తో ఏసీఆర్ భేటీ..
ఇప్పటికే బీజీపీకి రాజీనామా చేసిన ఎ.చంద్రశేఖర్ ఆదివారం నగరంలోని తన నివాసంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డితో కలిసి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై చర్చించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నెల 18న జహీరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదే విషయమై ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జిల్లా నాయకులతో తన నివాసంలో చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment