వామ్మో కోతులు | - | Sakshi
Sakshi News home page

వామ్మో కోతులు

Published Tue, Jan 23 2024 6:36 AM | Last Updated on Tue, Jan 23 2024 11:14 AM

కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డులో కోతుల గుంపు - Sakshi

కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డులో కోతుల గుంపు

ధారూరు: ధారూరు మండలం కోతులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. జిల్లాలోని అన్ని మండలాల కంటే ఇక్కడే ఎక్కువ మొత్తంలో అడవులు విస్తరించి ఉన్నాయి. మొదట్లో వానరాలు వందల సంఖ్యలో ఉండగా ప్రస్తుతం వేల సంఖ్యలో విస్తరించాయి. అడవుల్లో వాటికి భుజించడానికి ఏం దొరక్కపోవడంతో గ్రామాలు, తండాల్లోని పంట పొలాలకు, చివరకు ఇళ్లపైకీ వస్తున్నాయి. పొలాల్లో పంటలున్న సమయంలో అక్కడే తిష్టవేసి పంటలను నాశనం చేస్తున్నాయి. ఒక్కొక్కరు చొప్పున కాపలా ఉన్నా వాటికి భయమనేది ఉండదు.

ఇద్దరు, ముగ్గురు ఉంటేనే ఆ పొలం వైపు వెళ్లవు. గుంపులుగా రైతులపై దాడిచేసి గాయపరుస్తున్న సంఘటనలు లేకపోలేదు. పొలంలో ఏ పంట వేసిన పీకేయడం, తినడం సర్వసాధారణమైంది. వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చే సమయంలో రోడ్లకు అడ్డంగా పరుగుతీస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ద్విచక్ర వాహనదారులు రోడ్లపై కోతుల సంచారంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నా గత పదేళ్ల కాలంలో ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

తిండి దొరక్క
ధారూరు మండలంలోని దాదాపు 35 గ్రామాలతో పాటు పలు తండాల్లో కోతుల బెడద ఉంది. సాగుచేసిన పంటల్ని నాశనం చేయడంతో పాటు సమీప గ్రామాల ఇళ్లపైకి ఎక్కి నానా హంగమా చేస్తున్నాయి. మగవారు ఇళ్లలో లేని సమయాల్లో వానరాలు ఇళ్లలోకి దూరుతున్నాయని, ఇంట్లో ఉన్నా వారిని భయపెట్టి అందిన ఆహారాన్ని ఎత్తుకెళుతున్నాయి. వాటిని పారద్రోలే ప్రయత్నం చేస్తే కోతులు దాడులు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక్కోసారి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల టిఫిన్‌ బాక్సులు కన్పిస్తే చాలు లాక్కుని ఎత్తుకెళుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కూరగాయల సంతలో, ఇళ్లపైన నిత్యం సంచరిస్తూ వీలైనప్పుడల్లా ఎత్తుకెళుతున్నాయి.

ఎదురు దాడికి దిగుతున్న వైనం
మగవాళ్లు లేని సమయాల్లో ఇళ్లలోకి దూరుతున్నాయని, వాటిని ఎదురించే ప్రయత్నం చేస్తే దాడులకు పాల్పడుతున్నాయని మహిళలు వాపోయారు. ఎక్కువగా మహిళలు, చిన్నారులు, వృద్ధులను భయపెడుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. మగవాళ్లున్న సమయాల్లో ఇళ్ల ముందున్న చెట్లపై సంచరిస్తున్నాయని, వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన ఇలా వెళ్లి అలా తిరిగి వస్తున్నాయని వారు వాపోయారు. కుక్కలకు, కొండముచ్చులకు కూడా కోతులు భయపడటం లేదని, వాటిపైకి ఎదురుదాడికి దిగుతున్నాయని చెప్పారు. తాండూరు–హైదరాబాద్‌ ప్రధాన రోడ్డుపై, కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డుపైన సంచరిస్తూ వాహనదారులను ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు చొరవ తీసుకుని కోతులను అడవులకు వెళ్లేలా చేస్తే ప్రశాంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఓ ఇంటి ముందు హంగామా చేస్తున్న వానరాలు 1
1/1

ఓ ఇంటి ముందు హంగామా చేస్తున్న వానరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement