ఆన్‌లైన్ మోసానికి ప్రాణం బలి
అనంతగిరి: చిల్లర నాణేలు(సిక్కలు) సేకరించి ఇస్తే పెద్ద ఎత్తున డబ్బులు చెల్లిస్తామని.. ఓ ఆన్‌లైన్ సంస్థ వేసిన ఎరలో చిక్కుకున్న యువకుడు తీరా మోసపోయానని గుర్తించి పురుగుల మందు తాగి మృతిచెందాడు. ఈ ఘటన వికారాబాద్ మండలం పీరంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అవివాహితుడైన ఇతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఓ ఆన్‌లైన్ సంస్థనుంచి వచ్చిన ఆఫర్‌తో చిల్లర నాణేలు సేకరిస్తున్నాడు. వాటిని తీసుకునేందుకు కంపెనీ ప్రతినిధులను ఫోన్‌లో సంప్రదించగా రూ.35 వేలు చెల్లించాలని సూచించారు. ఆతర్వాత రూ.లక్షల్లో రిటర్న్ ఇస్తామని చెప్పిన మాటలు నమ్మాడు. అప్పు చేసి డబ్బులు చెల్లించాడు. అయినా నాణేలు సేకరించకపోవడంతో మరోసారి అందుబాటులోకి వచ్చిన సంస్థ ప్రతినిధులను నిలదీశాడు. మరికొంత డబ్బు చెల్లిస్తేనే నాణేలు తీసుకుంటామని చెప్పడంతో మరోసారి కొంత మొత్తం చెల్లించాడు. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయాయని గుర్తించి, శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సాయంత్రం పొలం నుంచి వచ్చిన తల్లి ఇది గమనించి స్థానికులు, కుటుంబ సభ్యుల సహకారంతో వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పెద్ద మొత్తంలో అవుతున్న ఫీజులు, మందులకు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోచిరెడ్డి తండ్రి రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చేతికి అందివచ్చిన కొడుకు కూడా మృతిచెందడంతో తల్లి అనాథగా మారింది. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment