
గొంతు తడపని ‘మిషన్ భగీరథ’
పరిగి: మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. పట్టణంలోని 5వ వార్డు (వేంకటేశ్వస్వామి ఆలయం చుట్టూ ఉన్న కాలనీలకు ఏడాదిగా నీటి సరఫరా కావడం లేదు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులకు కాలనీ వాసుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పట్టణంలోని చాలా కాలనీల ప్రజలు సొంత బోర్ల ద్వారా నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. పాత పరిగి, మరి కొన్ని కాలనీలకు మాత్రమే రోజూ నీటి సరఫరా జరుగుతోంది. పరిగి మున్సిపాలిటీలో 34,500 మంది జనాభా ఉండగా వారికి నిత్యం 42,22,500 లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం మున్సిపాలిటీలో 3.60 ఎంఎల్‌డీ బల్క్ వాటర్ అందుబాటులో ఉంది. మిషన్ భగీరథ ద్వారా 1.67 ఎంఎల్‌డీ నీరు సరఫరా చేస్తున్నారు. మోటర్ల ద్వారా 1.25 ఎంఎల్‌డీ నీరు, రెండు సంపుల ద్వారా దాదాపు 5లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇవి కాకుండా 72 బోర్లు, 15 ట్యాంకులు ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. వేసవిలో తాగునీటి కోసం రూ.15లక్షలు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
Comments
Please login to add a commentAdd a comment