
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
అనంతగిరి: గుట్టుగా నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. సుమారు రూ.10లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో పెద్దేముల్‌లో ఆదివారం టాస్క్‌ఫోర్స్, పోలీసులు తనిఖీలు చేస్తుండగా అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ వ్యక్తి నాలుగు ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. వెంటనే అతడిని అడ్డుకొని సంచులను పరిశీలించగా వాటిలో ఎలాంటి లేబుల్స్, ల్యాబ్, బ్యాచ్ నంబర్ లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని మండల వ్యవసాయాధికారి పవన్‌ప్రీతం పరిశీలించి నకిలీవని నిర్ధారించారు.
కర్ణాటక నుంచి సరఫరా
సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీలోని బాపట్ల జిల్లా మర్టూరు మండలం, కోనంకి గ్రామానికి చెందిన ఉప్పలపాటి వసంత్‌రావుగా గుర్తించారు. ఆయన 15 ఏళ్లుగా కర్ణాటక రాష్ట్రం గుర్మిట్‌కల్ తాలుకాకు చెందిన గాజుర్‌కోట్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి నకిలీ విత్తనాలను తెచ్చి అమ్మడానికి పెద్దేముల్ వచ్చారని తెలిపారు.మొత్తం నాలుగు సంచులలో సుమారు రూ.2.70 లక్షల విలువ కలిగిన 150 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. అనంతరం తాను నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లి తనిఖీలు చేయగా అక్కడ సుమారు రూ.7.20లక్షల విలువైన 4 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై పెద్దేముల్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా కరణ్‌కోట సీఐ నగేష్, పెద్దేముల్ ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
సుమారు రూ.10 లక్షల విలువ
పెద్దేముల్‌లో అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment