తీరని దాహం
మేతకు వెళ్లిన పశువుల దాహార్తి తీర్చేందుకు పొలాలు, బంజరు భూముల్లో నీటి సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈజీఎస్(ఉపాధిహామీ పథకం)లో లక్షలాది రూపాయలు వెచ్చించి నీటి తొట్లను నిర్మించింది. వీటి నిర్మాణ బాధ్యతలను ప్రజాప్రతినిధులకు అప్పగించారు. ఇదే అదనుగా భావించిన కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు వారికి ఇష్టమొచ్చిన చోట నిర్మించారు. కొన్ని చోట్ల నాసిరకంగా నిర్మించడంతో మూణ్నాళ్ల ముచ్చటగా మారి శిథిలావస్థకు చేరాయి. వీటిని నిర్మించే సమయంలో నీటి వసతి ఉందో లేదో గమనించలేదు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. మరికొన్ని చోట్ల నీరున్నా.. పైపులైన్ కనక్షన్ లేకపోవటం తదితర కారణాలతో వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. దీంతో నీటితొట్ల నిర్మాణ లక్ష్యం నెరవేరలేదు.
ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు
ఆరేళ్ల క్రితం ఉపాధిహామీ పథకంలో భాగంగా 18 మండలాల్లో 617 నీటి తొట్లు నిర్మించాలని నిర్ణయించారు.ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ.18 వేల చొప్పున రూ.1.39కోట్ల నిధులు మంజూ రు చేసింది. 400 పైచిలుకు తొట్లు నిర్మించి మిగిలినవి వదిలేశారు. వీటిని కాంట్రాక్టర్లే నిర్మించా లనే నిబంధనలున్నప్పటికీ చాలా వరకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులే నిర్మించారు. ఏనా డు వాటిని నీటితో నింపిన దాఖలాలు కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా 6,23,000 మూగజీవాలున్నట్లు పశుసంవర్ధక శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వాటి దాహార్తి తీర్చకపోగా లక్షలాది రూపాయల నిధులు నిరపయోగం చేశారని పశుపోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న వాటిలోనైనా నీరు నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సమన్వయలోపం..
జీవాలకు శాపం
పశువులకు నీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాటుచేసిన తొట్లు వినియోగంలోని తెచ్చేందుకు పశుసంవర్ధకశాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా తయారైంది. తొట్లకు నీటి సరఫరా చేసే విషయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం చర్యలు తీసుకోవాలి. ఇందుకు గ్రామస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ సహకరించాలి. ఈ ప్రక్రియను పశుసంవర్ధకశాఖ పర్యవేక్షించాల్సి ఉంది. వీరిమధ్య సమన్వయలోపం కారణంగా పశువులకు గుక్కెడు నీరు లభించడం కష్టంగా మారింది. కనీసం గ్రామ ప్రజాప్రతినిధులైనా స్పందించి నీటితొట్లను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
పశువుల దాహార్తిని తీర్చేందుకు గత ప్రభుత్వం ఆరేళ్ల క్రితం నీటి తొట్ల నిర్మాణానికి పూనుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వీటిని నిర్మించారు. ఒక్కో నీటితొట్టి నిర్మాణానికి రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. ఓ వైపు పశువులు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నా తొట్లను నింపడం లేదు. జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ఇదే పరిస్థితి దాపురించింది. మరి కొన్ని గ్రామాల్లో నేలమట్టం చేసిన దుస్థితి.
– వికారాబాద్
రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన నీటి తొట్లు
నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన వైనం
గుక్కెడు నీళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్న మూగజీవాలు
Comments
Please login to add a commentAdd a comment