విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి
హయత్‌నగర్: విద్యార్థులు గొప్ప లక్ష్యాన్ని ఎంచుకుని, సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని, ఇందుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేఎల్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇన్‌స్ప్రేషన్ అండ్ ఇగ్నేషన్ కార్యక్రమంలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మునుగనూరులోని మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నవారేనని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రపంచ మేధావులుగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చదువుతో పాటు ఆరో గ్యం, క్రమశిక్షణ అవసరమని గ్రహించిన ప్రభుత్వం ఇటీ వలే మెస్ చార్జీలు పెంచిందని తెలిపారు. కేఎల్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యాలయాలను నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు ముద్ద గోని రామ్మోహన్‌గౌడ్, జేఆర్‌పీ గురుకుల విద్యాలయాల సెక్రెటరీ సైదులు, జాయింట్ సెక్రెటరీ తిరుపతి, పాఠశాల ప్రిన్సిపాల్ జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment