‘కోపింగ్ విత్ క్యాన్సర్’ పుస్తకావిష్కరణలో రచయిత రమేంద్ర కుమార్
కంటోన్మెంట్: నవ్వుతూనే క్యాన్సర్‌ను జయించానని ప్రముఖ రచయిత, స్టోరీ టెల్లర్, ఇన్‌స్పిరేషనల్ స్పీకర్ రమేంద్ర కుమార్ అన్నారు. క్యాన్సర్ బారిన పడి..తన స్వీయ అనుభవాలతో రచించిన ‘కోపింగ్ విత్ క్యాన్సర్’ అనే పుస్తకాన్ని శనివారం సికింద్రాబాద్‌లోని గురుస్వామి సెంటర్‌లో ఆవిష్కరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ చేతుల మీదుగా జరిగిన పుస్తకావిష్కరణలో, ది హిందూ మాజీ అసోసియేటివ్ ఎడిటర్ సోమశేఖర్‌తో పాటు రమేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేంద్ర కుమార్ మాట్లాడుతూ 2021 నవంబర్ 29న తాను క్యాన్సర్ బారిన పడినట్లు తేలిందన్నారు. ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి కదిలినట్లయిందన్నారు. అయితే తన సతీమణి మాధురి, కుమార్తె అంకిత ఇతర కుటుంబ సభ్యులు ఇచ్చిన మనోధైర్యంతో చికిత్స తీసుకున్నానని అన్నారు. తాను బతకడం కష్టమని డాక్టర్లు నిర్ధారణకు వచ్చిన సమయంలో, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచిందన్నారు. ముఖ్యంగా తన కుమార్తె అంకిత తనకు ఎంతో ధైర్యాన్ని అందించిందన్నారు. అంతకు ముందు ఎందరికో మనోధైర్యాన్ని ఇచ్చేలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇచ్చిన తాను, వ్యక్తిగతంగా తనకు తాను నిభాయించుకున్నానని అన్నారు. షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ చెప్పిన ‘జో డర్ గయా..వో మర్ గయా’ డైలాగ్‌తో పాటు పుష్ప సినిమాలోని ‘జుఖేగా నహీ’ డైలాగ్ తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. దాదాపు ఆరు నెలల చికిత్స అనంతరం తాను క్యాన్సర్‌ను జయించగలిగానన్నారు. ‘మేనేజింగ్ ఎవ్రీ ట్యూమర్ విత్ హ్యూమర్’ అనే వ్యాక్యాన్ని నమ్ముతూ తనలాంటి వారికి స్ఫూర్తి కలిగించేందుకే పుస్తకం రాశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment