
బకాయి.. పేరుకుపోయి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు బిల్లులు జారీ చేసి, రెవెన్యూ కలెక్షన్ చేయాల్సిన ఇంజనీర్లు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పెండింగ్ బిల్లులు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ సర్కిళ్ల పరిధిలో 62 లక్షలకుపైగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లు ఉండగా, వీటిలో ప్రస్తుతం మెట్రోజోన్ పరిధిలో 3,94,763 సర్వీసులు, మేడ్చల్ జోన్‌లో 2,24,816 సర్వీ సులు, రంగారెడ్డి జోన్‌లో 2,84,902 సర్వీసులు సంస్థకు విద్యుత్ బిల్లు బకాయిపడ్డాయి. ఈ మేరకు అకౌంట్స్ విభాగం వందశాతం రెవెన్యూ కలెక్షన్స్ లక్ష్యంగా ప్రతి నెలా ‘డి’ లిస్ట్ (డిస్‌కనెక్షన్) తయారు చేసి, క్షేత్రస్థాయి ఇంజనీర్లకు అందజేస్తోంది. వీరు ఎప్పటికప్పుడు ఆయా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బకాయిలు భారీగా పేరుకుపోయి సంస్థ ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నారు.
ఆదేశాలు పట్టని సిబ్బంది
అత్యధికంగా మెట్రో జోన్ నుంచి రూ.72.32 కోట్లు రావాల్సి ఉంది. ఆ తర్వాత రంగారెడ్డిజోన్ నుంచి రూ.38.28 కోట్లు, మేడ్చల్ జోన్ నుంచి రూ.12 కోట్లకుపైగా బకాయి వసూలు కావాల్సి ఉంది. ఒక్క హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధి నుంచే రూ.51.06 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ బిల్లుల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆదేశించినప్పటికీ రంగారెడ్డి జోన్ ఇంజనీర్లు తప్ప మిగిలిన జోన్ ఇంజనీర్లు ఇప్పటి వరకు అటువైపు దృష్టి సారించలేదు. కేవలం మీటర్ రీడింగ్‌కే పరిమితం అవుతున్నారు. వందశాతం బిల్లులు వసూలు చేయాలనే డిస్కం ఆదేశాలను వారు సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రతి నెలా బకాయిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
భారీగా విద్యుత్ బిల్లుల పెండింగ్
మెట్రోజోన్‌లో రూ.72.32 కోట్లు
రంగారెడ్డి జోన్‌లో రూ.38.28 కోట్లు
మేడ్చల్ జోన్‌లో రూ.12 కోట్లు
వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్
మూడు జోన్ల పరిధిలో బకాయిలు (రూ.కోట్లలో)
సర్కిల్ బకాయిలు
హైదరాబాద్ సౌత్ 51.06
రాజేంద్రనగర్ 22.58
హైదరాబాద్ సెంట్రల్ 16.16
సైబర్‌సిటీ 7.70
వికారాబాద్ 5.45
సంగారెడ్డి 4.28
హబ్సిగూడ 4.04
మేడ్చల్ 3.73
సరూర్‌నగర్ 2.55
సికింద్రాబాద్ 2.05
Comments
Please login to add a commentAdd a comment