
ఆగిన రోడ్డు.. తప్పని తిప్పలు
త్వరలో పనులు ప్రారంభిస్తాం
రోడ్డును కొత్తగా వేయడం లేదు. ఇదే విషయాన్ని జిల్లా ఫారెస్టు అధికారి జ్ఞానేశ్వర్ దృష్టికి తీసుకెళ్లాం. పనులు తీసుకున్న కాంట్రాక్టర్ మోమిన్‌ఖుర్ధు నుంచి రాజాపూర్ వరకు ఉన్న అసంపూర్తి రోడ్డు పనులు చేశారు. త్వరలో ఈ రోడ్డును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం.
– శ్రీనివాసులు, పంచాయతీరాజ్ డీఈ
ధారూరు: పూర్తిగా పాడైన రహదారిని తిరిగి పునర్నిర్మిస్తుండగా అనుమతులు లేవంటూ అటవీ అధికారులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్ట్ నుంచి గడ్డమీది గంగారం, కుక్కింద ఉన్నత పాఠశాల, మున్నూరుసోమారం గ్రామం మీదుగా బుగ్గ శివాలయం దేవాలయం వరకు పాడైన రోడ్డును ఎంఆర్‌ఆర్ గ్రాంట్ ద్వారా విడులైన రూ.2.82 కోట్లతో పునర్నిర్మించడానికి నిధులు మంజూరు అయ్యాయి. కాంట్రాక్టర్ ముందుగా కుక్కింద ఉన్నత పాఠశాల నుంచి గడ్డమీది గంగారం గ్రామం వరకు కంకర వేశాడు. మధ్యలో ఉన్న కల్వర్టులను కొత్తగా నిర్మించాడు. గడ్డమీది గంగారం నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టు వరకు రోడ్డు పనులు చేస్తుండగా ఫారెస్టు అధికారులు తమ భూభాగం అంటూ నిలిపివేశారు. నెల రోజులుగా ముమ్మరంగా పనులు చేయించిన కాంట్రాక్టర్ అటవీశాఖ అభ్యంతరంతో పనులు మధ్యలోనే ఆపేశారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇబ్బంది పడుతున్న తమకు తీవ్ర నిరాశ ఎదురైందని వాహనదారులు వాపోయారు.
బస్సును నిలిపేశారు
ఈ మార్గంలో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పగటి పూట ఎలాగో వెళుతు న్నా రాత్రిపూట మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు. రోడ్డు బాగా లేదంటూ వికారాబాద్ నుంచి గడ్డమీది గంగారం వరకు నడిపే ఆర్టీసీ బస్సును సైతం ఆపేశారు. దీంతో కళాశాల, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థుల బాధ వర్ణనాతీతం. వెంటనే రోడ్డు పూర్తి అయ్యేలా చొరవ చూపాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరుతున్నారు.
గడ్డమీది గంగారం వద్ద రోడ్డు పనులు అడ్డుకున్న అటవీ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment