వసతి‘గ్రహాలు’
సంక్షేమ హాస్టళ్లలో వేధింపులు, ఎలుకల బెడద
వికారాబాద్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలు, వేధింపులకు కేంద్రాలుగా మారుతున్నాయి. హాస్టళ్లను ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడంతో కొంత మంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయుల వేధింపులు, ఫుడ్ పాయిజన్, ఎలుకలు కొరకడం వంటి వాటి కారణంగా విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తే తప్ప ఇలాంటి విషయాలు బయటకు రావడం లేదు. జిల్లాస్థాయి అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది మొదలు ఏదో ఒక హాస్టల్‌లో, గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటుడంతో మూడు నెలల క్రితం కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు హాస్టళ్లు, స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల హెచ్‌ఓడీలు మండలాల ప్రత్యేకాధికారులుగా నియమించి వారంలో రెండు స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.
వారంలో రెండు ఘటనలు
నవాబుపేట కేజీబీవీలో 15 రోజుల క్రితం నలుగురు విద్యార్థులను ఎలుకలు కరిచాయి. మరో మూడు రోజుల వ్యవధిలో మరో నలుగురు ఎలుకలు బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. హాస్టల్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించి చేతులుదులుపుకొన్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కేజీబీవీ సిబ్బందిని నిలదీశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, అధికారులు పాఠశాలను సందర్శించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
● 15రోజుల క్రితం వికారాబాద్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. బాలికలకు కాలు విరిగింది. మెట్ల పైనుంచి జారి పడటంతో కాలు విరిగిందని అపద్దం చెప్పి బాలికను తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండి పోయారు.
● ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని అధికారులు పదేపదే చెబుతున్నా అమలు కావడం లేదు. నాణ్యమైన సరుకులు, కూరగాయలు వాడకపోవడంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
● ఇటీవల చౌడాపూర్ మండలంలోని ఓ హాస్టల్ విద్యార్థులు మంచి భోజనం పెట్టాలని అడిగితే వార్డెన్ దుర్భాషలాడాలంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
● కుల్కచర్ల మండలంలోని ఓ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్‌కు గురై పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
● ఆ కొద్ది రోజులకే నస్కల్ కస్తూర్బా బాలికల పాఠశాలలో 26 మంది.. ఆ తర్వాత కొత్తగడి వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బూర్గుపల్లి గురకుల పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
● ఆ వెంటనే అనంతగిరిపల్లి బాలుర వసతి గృహంలో విద్యార్థులు జాండీస్ బారిన పడ్డారు.
● తాండూరు బాలికల వసతి గృహంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు ఆస్పత్రుల పాలయ్యారు. ఇలా నిత్యం ఏదో ఒక హాస్టల్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పర్యవేక్షణ గాలికి..
జిల్లాలో సోషల్, బీసీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటితో పాటు సీ్త్ర శిశుసంక్షేమం, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లు కలిపి ఒక్కో శాఖలో 20 నుంచి 25 వరకు ఉన్నాయి. మొత్తం వంద పైచిలుకు హాస్టళ్లు ఉన్నాయి. ఈ శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు కూడా ఉన్నారు. అయితే మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఉద్యోగ విరమణ పొందగా ఆ బాధ్యతలు యువజన విభాగం మరియు క్రీడల శాఖ జిల్లా అధికారికి అప్పగించారు. ఇక గురుకులాల బాధ్యతలు ఆర్‌సీఓలకు అప్పగించారు. హాస్టళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్యలు లేకుండా చూడాల్సిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం విద్యార్థులపై జరుగుతున్న వేధిపులను, ఇతర సమస్యలను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తరచూ ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థులు
పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment