సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్‌ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్‌లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్‌ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది.
● హెచ్‌ఎండీఏ పరిధి పెరగడంతో ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్పుల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్ధత నెలకొన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్‌కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం ద్వారా నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి.
ఇక ట్రిపుల్ ఆర్ వరకూ హైదరాబాద్
హెచ్‌ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment