చెరువుల చెంత గస్తీ
మాసబ్ చెరువు వద్ద గస్తీ కాస్తున్న టీం సభ్యులు
తుర్కయంజాల్: చెరువులు, కుంటలు, కాలువలను కబ్జా చేయలనుకునే వారు తస్మాత్ జాగ్రత్త. నిత్యం జలవనరుల వద్ద షిప్టుల వారీగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)కు చెందిన ఫోర్స్ గస్తీ కాస్తోంది. ఇటీవల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఇక మీదట వీటి పరిరక్షణకు నడుం బిగించింది. కొన్ని రోజులుగా పలు చెరువుల వద్ద రాత్రి, పగలు తేడా లేకుండా సిబ్బంది పహారా కాస్తున్నారు. దీంతో ఆక్రమణదారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటానికి సాహసించడం లేదు.
ఇరిగేషన్ సిబ్బంది సైతం..
హైడ్రాతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా రాత్రి వేళల్లో చెరువుల వద్దకు వచ్చి పరిశీలిస్తున్నారు. ఇటీవల తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు, ఇంజాపూర్‌లోని జిలావర్ ఖాన్ చెరువు, పెద్ద అంబర్‌పేటలోని ఈదులకుంట వద్ద హైడ్రా సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహించారు. హైడ్రా, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ పెరగడంతో చెరువుల్లో మట్టి పోయడానికి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. నెల రోజుల క్రితం మాసబ్ చెరువు వద్ద గస్తీ ప్రారంభించకముందు ఓ వ్యక్తి చెరువులో పెద్ద ఎత్తున మట్టిని డంప్ చేసిన విషయం తెలిసిందే. అతడిపై కేసు నమోదు చేయడంతో పాటు, చెరువులో పోసిన మొత్తం మట్టిని అధికారులు దగ్గరుండి తొలగించారు.
అన్యాక్రాంతం కాకుండా..
జిల్లాలో మొత్తం 1,075 చెరువులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉండే అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, గండిపేట, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మండలాల్లో ఆక్రమణలు ఎక్కువగా జరిగినట్లు గతంలోనే తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సర్వేలో వెల్లడైంది. వీరి సర్వే ప్రకారం 225 చెరువులు పూర్తిగా, 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు వెల్లడించారు. ఇలా కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని అన్యాక్రాంతం అవుతున్న వాటిని కాపాడడమే లక్ష్యంగా హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలపై హైడ్రా నజర్
పరిరక్షణకు పహారా
షిఫ్టుల వారీగా సిబ్బంది విధులు
అన్యాక్రాంతం కాకుండా చూడడమే పని
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment