నిబంధనలకు నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు నీళ్లు!

Published Wed, Apr 2 2025 7:31 AM | Last Updated on Wed, Apr 2 2025 7:31 AM

నిబంధ

నిబంధనలకు నీళ్లు!

ఇటీవల జ్వరం బారిన పడిన పలువురు పట్టణవాసులు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు చేసిన వైద్యులు.. కలుషిత నీటిని తాగడంతోనే ఇలా జరిగిందని నిర్ధారించారు. కొంతకాలం ఫిల్టర్‌ వాటర్‌ తాగాలని సూచించారు. అయితే తాము నిత్యం ప్లాంట్‌ నుంచి కొనుగోలు చేసిన నీటినే తాగుతున్నామని బాధితులు చెప్పారు. దీనిబట్టి తాండూరులోని వాటర్‌ ప్లాంట్లలో విక్రయిస్తున్న నీళ్లు ఎంత సురక్షితమో అర్థమవుతోంది.

తాండూరు: మున్సిపల్‌ పరిధిలో వాటర్‌ ఫిల్టర్‌(ఫ్యూరిఫై వాటర్‌) ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. రక్షిత నీటిని తాగాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో జనాలు ఇళ్లలోకి సరఫరా అవుతున్న భగీరథ నీటిని ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ తాగు నీటి కోసం వాటర్‌ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు.

నామమాత్రంగానే శుద్ధి

అసలే వేసవి కాలం కాలం కావడంతో చల్లని ఫిల్టర్‌ నీటిని తాగేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న నిర్వాహకులు నామమాత్రంగా శుద్ధి చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ పరిధిలో 60వరకు ప్యూరిఫై వాటర్‌ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. వేసవి సీజన్‌ కావడంతో పెద్ద మొత్తంలో నీళ్లు విక్రయిస్తున్నారు. కానీ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మండలాల్లోనూ అదే పరిస్థితి..

నియోజకవర్గంలోని పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌, తాండూరు మండలాల్లో సూమారు 180 వరకు వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. గతంలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ప్లాంట్లు ప్రస్తుతం గ్రామాల్లోనూ విరివిగా వెలుస్తున్నాయి. ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లో ఏటా రూ.కోట్ల వ్యాపారం జరుగుతున్నా.. కనీస నిబంధనలు అమలు చేయడాన్ని కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

మున్సిపల్‌ నీటితోనే శుద్ధి

పట్టణంలోని 60 ప్లాంట్లలో కేవలం నాలుగింటికి మాత్రమే మున్సిపల్‌ అనుమతి ఉంది. మిగిలినవన్నీ అక్రమంగానే కొనసాగుతున్నాయి. నల్లాల ద్వారా తాగునీరు రాని సమయంలో బోరు నీటిని శుద్ధి చేసి 20 లీటర్ల డబ్బాలు, క్యాన్‌లలో నింపి ఆటోలలో తరలిస్తూ విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి సరఫరా అయ్యే తాగునీటిలో 100 నుంచి 150శాతం లోపు మాత్రమే కలుషిత కారకాలు ఉండాలి. ఇంతకు మించితే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమే. వాటర్‌ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేస్తున్న నీటిలో 50 శాతంలోపు మాత్రమే ఉండాలి. కానీ ఇంతకు మించి కాలుష్య కారకాలు ఉంటున్నాయని తెలుస్తోంది.

నోటీసులు జారీ చేశాం

పట్టణం మొత్తంలో కేవలం నాలుగు ప్లాంట్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి నోటీసులు జారీ చేశాం. మున్సిపాలిటీలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడంతో తాగునీరు, ఆహారంపై తనిఖీలు చేయలేకపోతున్నాం. నీటి నాణ్యతను పరీక్షించిన తర్వాతే ప్రజలకు పంపిణీ చేయాలి.

– విక్రంసింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న ప్యూరిఫై వాటర్‌ ప్లాంట్లు

తాండూరు మున్సిపాలిటీలో 60కి

పైగానే.. అనుమతులు నాలుగింటికే!

ఏటా కోట్ల రూపాయల వ్యాపారం

అయినా ప్రజలకు అందని సురక్షిత తాగు నీరు

ఇవీ నిబంధనలు

ప్లాంట్‌ నిర్వహణ కోసం మున్సిపల్‌, పరిశ్రమల శాఖ, బీఎస్‌ఐ నుంచి అనుమతులు పొందాలి.

ప్లాంట్లలో మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ సిబ్బంది తప్పని సరిగా ఉండాలి.

పీహెచ్‌ స్థాయి 10కి ఉండాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి.

నీటిని సరఫరా చేసే డబ్బాలు పరిశుభ్రంగా ఉండాలి. వీటిని నిత్యం పొటాషియం పర్మాంగనేట్‌తో కడగాలి.

శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్‌ నంబర్‌ వివరాలను క్యాన్‌పై ముద్రించాలి.

నీటిలో పూర్తిగా కరిగిపోయే లవణాలను కూడా పరీక్షించాలి.

నిబంధనలకు నీళ్లు! 1
1/1

నిబంధనలకు నీళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement