సేవాలయాలు | - | Sakshi
Sakshi News home page

సేవాలయాలు

Published Mon, Apr 17 2023 12:46 AM | Last Updated on Mon, Apr 17 2023 12:46 AM

గ్రీవెన్స్‌ అందించేందుకు వచ్చిన ప్రజలతో కిటకిటలాడుతున్న సచివాలయం - Sakshi

గ్రీవెన్స్‌ అందించేందుకు వచ్చిన ప్రజలతో కిటకిటలాడుతున్న సచివాలయం

సాక్షి, విశాఖపట్నం : గతంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మండల కేంద్రానికి లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిజం చేశారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేస్తూ సేవలన్నింటినీ వారి చెంతకే తీసుకొచ్చారు. ప్రజలకు 544 ప్రభుత్వ సేవలను అందించే కార్యక్రమంతో ప్రతి సమస్య కూడా సచివాలయ సిబ్బంది పరిష్కరించడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మరోవైపు దేశంలో కీలకమైన ఆధార్‌ సేవలు కూడా సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రజలకు కష్టాలన్నీ తొలగిపోయాయి. విభిన్న సేవలందిస్తున్న సచివాలయాలు సేవాలయాలుగా మారాయి.

జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాలున్నాయి. ఇందులో మొత్తం 607 సచివాలయాలుండగా వార్డు సచివాలయాలు 545 ఉన్నాయి. గ్రామ సచివాలయాలు 62 వరకూ ఉన్నాయి. వార్డులు, గ్రామాల్లో నివసించే రైతు నుంచి కూలీ వరకు అన్ని వర్గాలకు అవసరమైన సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నాయి. ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పైసా లంచం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఉన్న ఊరు, వార్డుల్లోనే ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనన ధ్రువీకరణపత్రం నుంచి బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్‌ కార్డు, ఇంటి స్థలం పట్టా, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రైతులకు అవసరమైన భూ రికార్డులు, విద్యుత్‌, మంచినీటి కనెక్షన్‌ వంటి మొత్తం 544 సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ సేవలతో పాటు రేషన్‌ కార్డు కావాలన్నా, పెన్షన్‌ కావాలన్నా మండల, డివిజన్‌, జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేసినా మంజూరయ్యేవి కావు. పైగా లంచాలు ఇచ్చిన వారికి, పలుకుబడి ఉన్న వారికే అరకొర మంజూరయ్యేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా సేవలు అందుతున్నాయి.

ప్రతి రోజూ గ్రీవెన్స్‌

ప్రతి సచివాలయ పరిధిలోనూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అన్ని సచివాలయాల్లోనూ రోజూ గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలు తమ సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకునే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా విభిన్న రకాల సేవలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలంటూ స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను కూడా సచివాలయ ఉద్యోగులే తీసుకున్నారు. ప్రతి ప్రాంతంలోనూ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇప్పటి వరకూ గ్రీవెన్స్‌ ద్వారా 9,86,362 వినతులు రాగా ఇందులో 9,11,858 వినతులను పరిష్కరించారు. 51,025 అర్జీలను తిరస్కరించారు. మరో 23,479 వినతులు పరిశీలనలో ఉన్నాయి.

పెరుగుతున్న సేవలు

ఒక్కో సచివాలయంలో ప్రజల కోసం 544 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఆరు నెలల క్రితం సేవలందించే విషయంలో జిల్లాలోని సచివాలయాలు కాస్తా వెనుకంజలో ఉన్నాయి. కలెక్టర్‌ డా.మల్లికార్జున, జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి.. సేవలందించే విషయంలో దూకుడు ప్రదర్శించాలని సూచించారు. అప్పటి నుంచి జిల్లా సచివాలయాలు గేరు మార్చాయి. ఏపీ సేవా సర్వీసులను జిల్లా సచివాలయాలు ఇప్పటి వరకూ మొత్తం 2,96,054 వరకూ అందించి టాప్‌–5లోకి దూసుకెళ్లాయి. కోడి పందేలావీధిలోని వార్డు సచివాలయంలో నెలరోజుల్లో 1000 ఏపీ సేవలందించడం గమనార్హం. అదేవిధంగా ఆధార్‌ సేవలందించే విషయంలోనూ జిల్లా సచివాలయాలు జోరు పెంచాయి. ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 65,613 మందికి ఆధార్‌ సేవలను అందించడం విశేషం. ఆధార్‌ అప్‌డేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రజలను ఇబ్బందుల నుంచి దూరం చేసింది. గ్రామ, వార్డు స్థాయిల్లో ఉన్న సచివాలయాల్లోనే ఆధార్‌ సేవలను ప్రారంభించడంతో దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ తప్పి స్థానికంగానే ఆధార్‌ సేవలు అందుతుండడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు.

సచివాలయాల పరిధిలో పరిష్కరించిన కొన్ని విభాగాల వినతుల వివరాలివీ

డిపార్ట్‌మెంట్‌ వచ్చిన వినతులు పరిష్కరించినవి తిరస్కరించినవి

పౌరసరఫరాలు 33,944 21,293 10,090

రెవిన్యూ 4,01,027 3,55,728 27,023

ఆధార్‌ 65,613 65,613 00

బిల్‌ పేమెంట్‌సర్వీసు 2,78,776 2,78,776 00

ఈపీడీసీఎల్‌ 17,123 16,834 280

వైద్య,కుటుంబ సంక్షేమం 15,048 15,038 09

కార్మిక శాఖ 16,580 16,580 00

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 70,900 56,968 12,569

పంచాయితీరాజ్‌,గ్రామీణాభివృద్ధి 20,508 19,608 453

ప్రజలకు చేరువవుతున్న సచివాలయాలు

ప్రతి రోజూ గ్రీవెన్స్‌

9,86,362 వినతులు రాగా.. 9,11,858 పరిష్కారం

ఇప్పటి వరకూ 2,96,054 సేవలందించిన సచివాలయాలు

ఆధార్‌ సేవలతో ప్రజలకు చేరువైన సిబ్బంది

65,613 మందికి ఆధార్‌ సేవలు పూర్తి

నాణ్యమైన, పారదర్శకంగా ప్రభుత్వ సేవలు

గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఉన్న ప్రాంతంలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలందుతున్నాయి. ప్రతి సేవకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దిష్ట గడువు విధించారు. గడువులోగా సేవలు, వినతులు పరిష్కృతమవ్వాలని కలెక్టర్‌ ఆదేశించిన మేరకు సచివాలయాల్లో సేవలు వేగవంతం చేశాం. సచివాలయాలకు వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు కలెక్టర్‌, జేసీ, డీఆర్‌వో నిరంతరం సలహాలు, సూచనలందిస్తున్నారు. దానికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులను ఎప్పటికప్పుడు మానటరింగ్‌ చేస్తూ ప్రజలకు కూడా సెక్రటేరియట్స్‌లో అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన విస్తృతం చేశాం. ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి.

– పూర్ణిమాదేవి, డీఎల్‌డీవో, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement